వందకోట్ల పేదల డబ్బు దోచుకొని లిక్కర్ స్కాం చేసిన ఎమ్మెల్సీ కవితకు ఒక న్యాయం, తిండి కోసం ఇరవై ఏళ్లుగా పోడు చేసుకున్న ఆదివాసులకు ఇంకో న్యాయమా అని BSP రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.. చార్జిషీట్ లో పేరున్న కవిత బంగళాల్లో ఉంటే, ఆదివాసులు తిండికోసం పోడు చేసుకున్నందుకు కేసులతో జైళ్లో ఉన్నారని విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 149వ రోజు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లక్షల ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా చేసిందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. 400 మంది విద్యార్థులు ఉన్న చోట ఒకే టాయిలెట్ ఉండడం ఏంటన్నారు. రూ.2వేల కోట్లతో సెక్రటేరియట్, రూ.700ల కోట్లతో కంట్రోల్ సెంటర్ నిర్మించే బదులు టాయిలెట్స్ నిర్మిస్తే... విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందేవని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.