బీజేపీ మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభపెడుతోంది

చండూరు, వెలుగు: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ బోగస్‌ ఓట్లతో గెలవడానికి ప్రయత్నిస్తోందని, ఇప్పటికే కొత్తగా 23 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోందని, ఈ వ్యవహారంపై  విచారణ జరిపించాలని బీఎస్​పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల, ఇడుకూడ, చండూరుల్లో పర్యటించారు. బీజేపీ అక్రమంగా మద్యం, డబ్బు డంప్ చేసిందని, ఓటర్లను ప్రలోభపెడుతోందని ఆరోపించారు. బీఎస్పీ నిజాయితీపరుడైన బీసీ అభ్యర్థికి టికెట్​ ఇవ్వడంతో మూడు పార్టీలకు నిద్రపట్టడం లేదన్నారు. ఎస్​సీ, ఎస్టీ, మైనారిటీలు బీఎస్పీకి మద్దతిస్తుండడంతో ఏం చేయాలో తోచక ప్రధానపార్టీల నేతలు రూ. కోట్లు ఖర్చు చేస్తూ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను కొంటున్నారని మండిపడ్డారు. ఆధిపత్య పార్టీలు ఎన్ని  ప్రలోభాలకు గురిచేసినా ఈ సారి ఏనుగు గుర్తుకే ప్రజలు ఓటేస్తారన్నారు.

70 ఏండ్లుగా గెలిచిన దొరలు ఇండ్లు, రోడ్లు, వైద్యం కూడా అందించకుండా వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు.  ప్రభుత్వం పిల్లలకు బుక్స్, యూనిఫాం ఇవ్వడంలేదని, రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని పెంచుతున్నారని, టీఆర్ఎస్​లిక్కర్ స్కాంలో ఇరుక్కుందన్నారు. కేసీఆర్​బంధువు అభిషేక్ రావు ఈ స్కామ్​లో అరెస్టయ్యారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు పేదలతో  జెండాలు మోపించి.. ఇపుడు  దొరలకు అమ్ముడుపోయారన్నారు. బహుజన రాజ్యం వస్తే నిరుపేదలకు ఎకరం భూమి, విదేశీ విద్య, పది లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టులు,ఉచిత వైద్యం అందిస్తామన్నారు. తర్వాత చండూరులో కోలాటం వేసే మహిళలతో కలిసి భోజనం చేశారు. మునుగోడు బీఎస్పీ అభ్యర్థి శంకరాచారి, జిల్లా నాయకులు జగన్నాథగౌడ్, ప్రమీల, పూదరి నర్సింహ, ఏర్పుల అర్జున్, కవిత పాల్గొన్నారు.