8 వేల కోట్లతో రిపేర్లు చేసి వానలొస్తే స్కూళ్లకు సెలవులిస్తున్నరు

  • లక్షల జీతం తీసుకునే సీఎం జీపీ కార్మికుల శ్రమను దోచుకుంటుండు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

పెద్దపల్లి, వెలుగు : మన ఊరు మన బడి కింద స్కూళ్ల రిపేర్ల కోసం దాదాపు రూ. 8 వేల కోట్లు కేటాయించామని చెబుతున్నారని, అయినా ఈ రాష్ట్రంలో వర్షాలు పడితే స్కూళ్లకు సెలవులు ఇచ్చే పరిస్థితి ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మనవడు రూ.40 లక్షల పాకెట్ మనీతో ఓ ప్రభుత్వ స్కూల్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే, కనీసం రూ.4  పాకెట్ మనీ కూడా ఇవ్వలేని దుస్థితిలో పేద వర్గాల వారు బతుకుతున్నారన్నారు. రాష్ట్రంలో 20 వేల టీచర్​పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని సర్కారు భర్తీ చేయడం లేదన్నారు. నాయకులు దాసరి హనుమయ్య,  దాసరి ఉష, గొట్టే రాజు, తోట వెంకటేశ్ పటేల్, కుమ్మరి సవిత, బాల కళ్యాణ్ పంజా, మొలుమూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు. 

పాస్​పోర్ట్ ​దొంగలకు అధికారమిస్తే ఇట్లనే ఉంటది..బీఎస్పీ అధికారంలోకి వచ్చాక జీపీ, మున్సిపల్​కార్మికులను పర్మినెంట్ చేస్తామని ప్రవీణ్​కుమార్ హామీ ఇచ్చారు.పెద్దపల్లిలో అమరవీరుల స్తూపం వద్ద 15 రోజులుగా జీపీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముసుగులో వచ్చిన పాస్ పోర్ట్ దొంగలు, దొంగ నోట్లు చలామణి చేసే వ్యక్తులకు అధికారమిస్తే పరిస్థితులు ఇట్లనే ఉంటాయని విమర్శించారు. పారిశుధ్య కార్మికులు సమ్మె వీడి, విధుల్లో చేరితే వారి డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇవ్వడం చేయడం పెద్ద జోక్​ అన్నారు.

అసైన్డ్​ భూముల్లో బీఆర్ఎస్​ రియల్​ దందా

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు:  సంవత్సరాల కింద దళితులు, గిరిజనులకు కేటాయించిన భూములకు రక్షణ కల్పించాల్సిన బీఆర్​ఎస్​ ప్రభుత్వం, ఆ భూములను గుంజుకుని రియల్​ ఎస్టేట్​ దందా చేయడం దుర్మార్గమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ఫైర్​ అయ్యారు.  జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మెకు గురువారం ఆయన సంఘీభావం తెలిపారు.  

ఈ సందర్భంగా ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల ఎకరాల అసైన్డ్​ భూములను ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు.  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ పథకం అమలు లోపభూయిష్టంగా మారిందన్నారు. 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడి సీఎం కేసీఆర్​ 8 వేల కోట్ల కాంట్రాక్టును మెఘా కంపెనీకి కట్టబెట్టిందని విమర్శించారు.  బీసీ జనాభా గణన చేపట్టడంలో మోడీ మీనమేషాలు లెక్కబెడుతున్నారని ఆరోపించారు.