
- తాత,తండ్రి నడుపుతున్న సర్కార్ లోనే స్కూళ్లకు ఈ దుస్థితి
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు: సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు సర్కారు బడుల్లో ఉన్న దుస్థితి, సమస్యల మీద నిజాయతీగా మాట్లాడారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణలో ఏండ్ల కాలంగా శిథిలావస్థకు చేరిన స్కూళ్ల గురించి స్వయానా సీఎం కేసీఆర్ కుటుంబం నుంచే ఒకరు ముందుకు వచ్చి మాట్లాడడం స్వాగతిస్తున్నామని, హిమాన్షు అమాయకంగా మాట్లాడినా నిజం చెప్పాడన్నారు.
బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ప్రవీణ్కుమార్గురువారం కాగజ్ నగర్‌లోని పలు వార్డుల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీమంతులు చదివే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాజెక్టులో భాగంగా ఈ సోషల్ వర్క్ చేసిన హిమాన్షుతో పాటూ స్కూల్ టీచర్లను అభినందించారు. అయితే ఈ సోషల్ సర్వీస్ చేసేందుకు తనకి తాత కేసీఆర్ స్ఫూర్తి అంటూ హిమాన్షు చెప్పించడం రాజకీయంలో భాగమని ఆరోపించారు.
అభం శుభం తెలియని స్టూడెంట్ ను రాజకీయాల కోసం వాడుకున్నట్లుగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. బహుజన వలంటీర్‌గా వస్తే హిమాన్షుకు చీకటి ప్రపంచాన్ని చూపిస్తామన్నారు. అందరి కోసం తెచ్చుకున్న తెలంగాణ, కొందరి తెలంగాణగా ఎందుకు మారిందో తెలుసుకునేందుకు ప్రాజెక్టును తీసుకోవాలని ఓక్రిడ్జ్ స్కూల్ కు సలహా ఇచ్చారు. ఇలా చేయకపోతే ఇది కేవల పబ్లిసిటీ స్టంట్ అవుతుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అర్షద్ హుస్సేన్, సీడం గణపతి, జిల్లా నాయకులు సోయం చిన్నయ్య, దుర్గం ప్రవీణ్, నియోజకవర్గ నాయకులు రాంటెంకి నవీన్ పాల్గొన్నారు.