సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే గడువులోగా పథకాలన్నింటిని తమకు ఓట్లు వేసే వారికే విడుదల చేయాలని అని మంత్రి ఎర్రబెల్లి అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారని..ఎర్రబెల్లి వ్యాఖ్యల వెనకాల సీఎం కేసీఆర్ ఉన్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులను చేతిలో పెట్టుకుని పాలన సాగిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న పోలీసులను జిల్లాలో నియమించుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బులు పట్టుకున్న పోలీసులు.. ఒక చోటనైనా అధికార పార్టీకి చెందిన డబ్బులు పట్టుకున్నారా? అని ప్రశ్నించారు. స్వయంగా మంత్రుల కార్లలో వందల కోట్ల డబ్బులు తెచ్చి ఇంటింటికి పంచినా.. పోలీసులు పట్టుకోలేదని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి ప్రజలను మోసం చేసిన కేటిఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం గ్రామంలో 600 ఎకరాల కాందిశికుల భూమి పై మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కన్ను వేశారని ఆరోపించారు. దత్తత తీసుకోవడం అంటే ఇదేనా అని నిలదీశారు. సమగ్ర కుటుంబ సర్వే చేయించి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా..ఆ వివరాలు దగ్గర పెట్టుకొని ప్రజలతో కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.