సిర్పూర్​ గడ్డపై నీలి జెండా ఎగరేస్తం: ​ ప్రవీణ్ కుమార్

సిర్పూర్​ గడ్డపై నీలి జెండా ఎగరేస్తం: ​ ప్రవీణ్ కుమార్

దహెగాం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్  గడ్డపై నీలి జెండా ఎగురవేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  చెప్పారు. బహుజనవాదం రాజ్యమేలడం ఖాయమని, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా కష్టపడాలని ఆయన సూచించారు. గురువారం సిర్పూర్  అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి దహెగాం మండలంలోని బిబ్రా ఇట్యాల, గొర్రెగుట్ట, కేస్లాపూర్, రాల్లగుడెం తదితర ప్రాంతాల్లో ఆర్ఎస్  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనప్ప పోలీసులను అడ్డుపెట్టుకొని పల్లెల్లో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. 15 ఏండ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి కూడా గుడిపేటకు రోడ్డు సౌకర్యం సైతం కల్పించలేదని, అలాంటి ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజల చైతన్యం అభినందనీయమని పేర్కొన్నారు. 

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్ ను గద్దెదించాలని ఓటర్లను ఆయన కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.