ఎమ్మెల్యే కోనప్ప అండతోనే భూ కబ్జాలు : ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

 

  • ఎమ్మెల్యే కోనప్ప అండతోనే భూ కబ్జాలు
  • తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎట్ల చేస్తరు
  • సిర్పూర్​లోని మాఫియా పాలన అంతం చేస్తం
  • బీఎస్పీ స్టేట్​ చీఫ్ ​ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు:  బీఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూములు కబ్జా చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్ ఆరోపించారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆక్రమించుకుంటూ పోతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల తహసీల్దార్ ఆఫీస్​ ముందు గురువారం ఆయన భూ సమస్య బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరుడు, కౌటాల ఎంపీపీ విశ్వనాథ్ కోయగూడకు చెందిన  డెండుగూరె బాబురావుకు చెందిన 8 ఎకరాల భూమిని ఫేక్​డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారని ఆరోపించారు. 

ఎమ్మెల్యే కోనప్ప బాధితులు ధైర్యంగా ఉండాలని, బీఎస్పీ అండగా ఉంటుందని చెప్పారు. సమస్యలను స్థానిక బీఎస్పీ నేతల దృష్టికి తేవాలని సూచించారు. 30 ఏండ్లుగా సాగు చేసుకొంటూ, రైతుబంధు పొందుతున్న వ్యక్తికి చెందిన భూమిని రెవెన్యూ అధికారులు ఇతరులకు పట్టా ఎలా చేస్తారని ప్రశ్నించారు. అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో మాఫియా పాలన సాగుతోందని మండిపడ్డారు. 

ALSO READ :రాష్ట్రాన్ని మణిపూర్​లా మార్చే కుట్ర: మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​

బీఎస్పీ ఆధ్వర్యంలో త్వరలోనే అంతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కన్నెపల్లి, నాగుల్వాయి గ్రామస్తులు కొందరు బీఎస్పీలో చేరగా, ప్రవీణ్​కుమార్​పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్​చార్జి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా ఇన్​చార్జి సోయం చిన్నయ్య, నాయకులు దుర్గం ప్రవీణ్, నవీన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.