
- సీఎం ఇలాఖా గజ్వేల్ లో డీఎంఎఫ్ టీ నిధులెలా వాడుతరు?
- తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్ల రాజ్యం
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు : సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఎలాంటి మైనింగ్, గనులు లేకున్నా సింగరేణికి సంబంధించిన డీఎంఎఫ్టీ నిధులను ఎలా తరలిస్తారని, కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రాంత అభివృద్ధికి వినియోగించాల్సిన ఈ ఫండ్స్‌తో సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం ఏమిటని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం కాగజ్‌నగర్‌లోని ఇంట్లో ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు, కేబుల్ బ్రిడ్జి అన్నీ సొంత నియోజకవర్గంలో కట్టుకున్న కేసీఆర్.. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల గురించి పట్టించుకోవడం లేదన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ గురించి కేసీఆర్ గొప్పగా చెబుతున్నారని, కానీ, అది అయిదేండ్లకే కుంగిపోవడం ఆయన చేసిన అవినీతికి నిదర్శనమన్నారు. రాష్ట్రం కోసం పోరాడి తన్నులు తిని, కేసుల పాలైంది ఈ ప్రాంతవాసులైతే, ఆంధ్రా కాంట్రాక్టర్లు లాభపడుతున్నారన్నారు. తుమ్మిడిహెట్టి, ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్‌తో తరలించి సిర్పూర్ సహా ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ప్రాంతాల రైతుల నోట్లో మట్టి కొట్టారని, కాగజ్ నగర్ సభకు వస్తున్న సీఎం కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఏడాదిగా జైలులో ఉంటే అదే కేసులో రూ.వందకోట్లు ఇచ్చిన కేసీఆర్ బిడ్డ కవిత ఎలా బయట తిరుగుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని అందుకే కవిత బయట ఉందన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఓటర్లకు పంచేందుకు నకిలీ బంగారు గొలుసులు, నకిలీ కరెన్సీ రెడీ చేశారని ఆరోపించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, కార్యనిర్వహణ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు లేండుగురే శ్యామ్ రావ్ తదితరులున్నారు.