
సిర్పూరు పేపర్ మిల్ యాజమాన్యంతో మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కోనప్ప కుమ్మక్కై, రహస్య ఒప్పందంతోనే కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాగజ్ నగర్ పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో సిర్పూరు పేపర్ మిల్ (ఎస్పీఎం) కార్మికులతో ఆదివారం (జులై 9న) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
పేపర్ మిల్ కంపెనీ యాజమాన్యం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కోనప్ప చేతిలో బందీలై.. కార్మికుల కష్టాలను పరిష్కరించడం లేదన్నారు. పేపర్ మిల్ లో పనిచేసే కార్మికులకు చెల్లించే వేతనాల్లో.. స్థానికులకు, స్థానికేతరులకు తీవ్ర వ్యత్యాసం ఉందని చెప్పారు. ఎస్పీఎం కార్మికుల పిల్లలకు ఉచిత విద్య అందడం లేదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్మికులకు సరైన వైద్యసేవలు కూడా అందడం లేదన్నారు. చివరకు కంపెనీలో పని చేసే కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం కూడా లేని దౌర్భాగ్య స్థితిలో పేపర్ మిల్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కంపెనీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కంపెనీలో పనిచేసే కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. సిర్పూరు పేపర్ మిల్ కు ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటించినా కార్మికులకు మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. కార్మికులు పక్షాన స్థానిక ఎమ్మెల్యే కోనప్ప, మంత్రి కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీఎం కంపెనీ కార్మికుల ఎన్నికలు జరపడం లేదని ఆరోపించారు. కంపెనీ నుంచి వచ్చే కలుషిత గాలి, నీరుతో ఇక్కడి ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. కార్మికుల పిల్లల చదువులకు నోట్ పుస్తకాలు కూడా కంపెనీ ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు.
స్థానికులకు కంపెనీలో ఉద్యోగాలు దొరకడం లేదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప మాత్రం సిర్పూర్ ప్రాంతాన్ని దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చారని ఆరోపించారు. పేదల కష్టాలు తీర్చేందుకే ఉన్నత ఉద్యోగం వదిలి, తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. కార్మికులకు, పేద ప్రజలకు అండగా, తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆలోచించాలని కోరారు. ‘‘మీ కోసమే సిర్పూర్ వస్తున్న.. మీ బిడ్డగా ప్రజలందరూ ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలి’’ అని కోరారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కార్మికులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు.
బోనాల ఉత్సవాల్లో ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన ఆషాడం మహంకాళీ బోనాల ఉత్సవాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో.. సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. మహంకాళీ తల్లి దయ అందరిమీద ఉండాలని వేడుకున్నారు. అంతకుముందు.. డప్పు చప్పులతో ర్యాలీగా మహంకాళీ దేవాలయం వద్దకు బయలుదేరారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ర్యాలీలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జ్ అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, నియోజకవర్గ అధ్యక్షులు రాంప్రసాద్, దుర్గం ప్రవీణ్, సోయం చిన్నయ్య, మహిళా నాయకురాలు లీలా గౌడ్ పాల్గొన్నారు.