కాగజ్ నగర్, వెలుగు: బీజేపీ రాజ్యాంగ విలువలు కాపాడడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రెండు రోజుల కిందట లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని ముల్లా టెర్రరిస్ట్ అంటూ బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన వాడిన భాష ఒక మతాన్ని కించపర్చేలా ఉందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే లను ఓడించాలని పిలుపునిచ్చారు.
స్థానికులకు ఎస్పీఎంలోఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నియోజక వర్గంలో దళిత బంధు, బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారో వివరాలు బయటపెట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలపునిచ్చారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, సోయం చిన్నయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్, మాజీ జడ్పీటీసీ పిల్లల తిరుపతి, జిల్లా కోశాధికారి నవీన్, మనోహర్, రాంప్రసాద్, ఇంతియాజ్ పాల్గొన్నారు.