నల్లగొండ : BRS, BJP, కాంగ్రెస్ పార్టీలు BSPకి వస్తున్న ఆదరణ చూసి భయపడుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇసుక, మట్టి మాఫియా, గుండాగిరి, కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామనని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాతో నకిరేకల్, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దాదాపు రూ.3500 కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. ఇదంతా సీఎం కేసీఆర్ కు తెలియకుండా జరుగుతుందా..? ఇందులో సీఎం వాటా ఎంతో చెప్పాలి..? అని డిమాండ్ చేశారు. రాష్టంలో పేద ప్రజలకు చెందాల్సిన కోట్ల రూపాయలను ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పీడీ యాక్టు వంటి కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల పట్టణ కేంద్రంలో బీఎస్పీ నియోజకవర్గ రాజకీయ చైతన్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు, బీఎస్పీ జాతీయ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్, రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.
ధరణి పోర్టల్ ను అడ్డు పెట్టుకొని అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 20 ఏళ్లు పూర్తైన ఇప్పటికీ బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల మీద ఉన్న ప్రేమ నల్లగొండ జిల్లా మీద ఎందుకు లేదన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్ గురించి సీఎం కేసీఆర్ ను అడిగే దమ్ము లేని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో ర్యాగింగ్ తో దళిత బిడ్డలు చదువుకు దూరం అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ, మరణించిన విద్యుత్ కార్మికుల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై త్వరలో బీఎస్పీ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వం : రాంజీ గౌతమ్
దళిత, ఆదివాసీ, పేద ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ బీఎస్పీ పార్టీ విస్తరిస్తోందని చెప్పారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ సీఎం కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. రిజర్వేషన్ ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం, విగ్రహాలు పెట్టడం గొప్ప కాదన్న రాంజీ గౌతమ్.. అండేడ్కర్ ఆశయాలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కురుకుపోయిందని ఆరోపించారు. 2024లో రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలందరూ బీఎస్పీ వైపే ఉన్నారని చెప్పారు.