నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌లోని మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్‌తో రైతులకు కొంచెం కూడా ఉపయోగంలేదని బీఎస్పీ స్టేట్చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నష్టపోయే భూనిర్వాసితులు ప్రశ్నిస్తే హత్యాయత్నం కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. నిర్వాసితులు భయపడాల్సిన అవసరంలేదని, వారికి తాము అండగా ఉంటామన్నారు. ఆదివారం ఆయన రైతులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కేవలం కమీషన్లు, కాంట్రాక్టర్ లాభాల కోసమే రీడిజైన్ నిర్ణయం తీసుకున్నారని, ప్రజాధనాన్ని దోచుకునే పాలకుల కుట్రను ఆపాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వాయర్ డిజైన్ మార్చడం వల్ల ఎనిమిది గిరిజన తండాలు, రెండు గ్రామ పంచాయతీలు ముంపునకు గురవుతాయన్నారు. నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. తరతరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులు, చిన్నకారు రైతులు నిర్వాసితులుగా మారతారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న 300 ఎకరాల ఫామ్‌హౌస్‌ను ప్రాజెక్టుల పేరుతో లాక్కుంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. రైతులపై నమోదు చేసిన హత్యా యత్నం కేసులు ఎత్తివేయాలన్నారు. కాళేశ్వరం 21, 22 ప్యాకేజీ పనులు తొమ్మిదేండ్ల నుంచి ముందుకు సాగడం లేదని విమర్శించారు.
వీడీసీ ముసుగులో అరాచకాలు ఆపాలి
మోర్తాడ్ : వీడీసీల ముసుగులో సామాన్యులపై అరాచకాలు ఆపాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతే గ్రామంలో కొన్ని నెలలుగా దళితుడైన రవి కుటుంబానికి, వీడీసీకి మధ్య భూతాగాదా నెలకొంది. ఈ క్రమంలో ఆయన భూమిని లాక్కునే ప్రయత్నాలు జరుగుతుండగా విషయం తెలుసుకున్న ప్రవీణ్‌కుమార్..గ్రామానికి వచ్చి రవి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ వీడీసీ వ్యవస్థ పల్లెల్లో అరాచకం సృష్టిస్తోందని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవి కుటుంబానికి రక్షణ కల్పించే బాధ్యత పోలీసులదేనన్నారు. దళితులకు అన్యాయం జరిగితే ఆందోళన చేస్తామన్నారు.