మునుగోడు, వెలుగు: మునుగోడులో ఇప్పటికే నైతికంగా గెలిచామని, ఉప ఎన్నికలోనూ విజయం సాధిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా జక్కలవారిగూడెం, రావిగూడెం, కచలాపురం, చొల్లేడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజురోజుకు బీఎస్పీకి ఆదరణ పెరుగుతుండడంతో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కు భయం పట్టుకుందన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు సహా వంద మందిని టీఆర్ఎస్.. కేంద్ర మంత్రులు సహా ఎమ్మెల్యేలను బీజేపీ రంగంలోకి దించిందని చెప్పారు. కాంగ్రెస్ అమ్ముడుపోయిందని ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ దోచుకున్న సొమ్మంతా ప్రజలకు పంచుతాం. కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సొంత విమానంలో పారిపోతారు” అని అన్నారు.