ఎస్పీఎం కార్మికులకు కేసీఆర్​అన్యాయం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఎస్పీఎం కార్మికులకు కేసీఆర్​అన్యాయం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  •    ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలు నిర్వహించలే..
  •     బీఎస్పీ గెలిచిన ఆరు నెలల్లో ఎలక్షన్లు నిర్వహిస్తం
  •      కార్మికులను బానిసలుగా చూస్తున్న యాజమాన్యం 
  •     బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు : సిర్పూర్ నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉన్న ఎస్పీఎం పేపర్ మిల్లులో వేలాది మంది కార్మికుల దుస్థితి చూస్తే కేసీఆర్ చేసిన అన్యాయం కనిపిస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం కాగజ్ నగర్ లోని ఎస్పీఎం మెయిన్ గేట్ ఎదుట కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. 

ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం ఎస్పీఎం కంపెనీ కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. బీఎస్పీని గెలిపిస్తే ఆరు నెలల్లో ఎలక్షన్లు జరిపిస్తామన్నారు. పేపర్ మిల్లులో స్థానికులకు, స్థానికేతరులకు చెల్లించే వేతనాల్లో తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య , కార్మికులకు సరైన వైద్యసేవలు అందడం లేద న్నారు. క్యాంటీన్ సౌకర్యం కూడా లేకపోవడం దారుణమన్నారు. కంపెనీ నడుపుతున్న జేకే యాజమాన్యం కార్మికులను బానిసలుగా చూస్తోందన్నారు.

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.30 లక్షలు ఎక్స్​గ్రేషియా చెల్లించాలని, అందరినీ పర్మినెంట్ ​చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ నుంచి వచ్చే కలుషిత గాలి, నీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఎమ్మెల్యే కోనప్ప సిర్పూర్ ప్రాంతాన్ని దోచుకుంటున్నారన్నారు. బీఎస్పీ గెలిచిన వెంటనే అత్యాధునిక సదుపాయాలతో ఈఎస్ఐ దవాఖానను కొత్తగా నిర్మిస్తామన్నారు. 200 మంది కార్మికులను విధుల్లోకి తీసుకుంటామన్నారు.  సిర్పూర్‌(టి) మండలంలోని పెన్‌ గంగా తీరాన ఉన్న టోంకిని సిద్ధి హనుమాన్‌ ను దర్శించున్న ప్రవీణ్​కుమార్​  ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 

బీఎస్పీకి హిందూ మజ్దూర్ సంఘ్ మద్దతు 

బీఎస్పీ సిర్పూర్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్లూరి సత్తయ్య తెలిపారు. బాలాజీనగర్​లోని బీఎస్పీ ఆఫీసులో మాట్లాడుతూ ఈ ప్రాంతం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే బీఎస్పీని గెలిపించాలని కోరారు. సంఘం కార్యవర్గ సభ్యులు జి.జాషువ, ఏ.సమ్మిరెడ్డి, బి.ఐలేశ్ యాదవ్, హవ్వారి జనార్దన్ పాల్గొన్నారు.