
- మేడిగడ్డ బ్యారేజీ పాపం కేసీఆర్‌దే..
- బీఎస్పీ అధికారం లోకి రాగానే
- ప్రాజెక్టుల అవినీతిపై విచారణ చేయిస్తాం
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు : సీఎం కేసీఆర్ ఇంజినీర్ అవతారం ఎత్తి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్ చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతోనే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎడారిగా మారిందని, కమీషన్ల కోసం రికార్డ్ టైమ్ లో కట్టినట్లు గొప్పలు చెబుతున్న మేడిగడ్డ బ్యారేజీ పగుళ్ల పాపం కేసీఆర్ దే అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని నాగపల్లి, గిన్నెలేటి చింతల మానేపల్లి మండలంలోని నందికొండ, బాబాపూర్, లంబడిహెట్టి, రణవెళ్లి, బూరవెల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కాంట్రాక్టుల్లో కమీషన్ల కోసమే కేసీఆర్ నాసిరకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని ఆరోపించారు.
సిర్పూర్ ప్రాంత రైతాంగానికి సాగునీరందించే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ పూర్తయిన తర్వాత అధికారం చేపట్టిన కేసీఆర్.. ప్రాజెక్టు నామరూపాలు లేకుండా చేశారని మండిపడ్డారు. సిర్పూర్ టి నియోజక వర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు.
గిరిజనులు సాగు చేసుకునే పోడు భూములకు పట్టాలివ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులు నష్టపరిహారం అందక అన్యాయానికి గురయ్యారన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపించి కేసీఆర్ అవినీతి, అక్రమాలను బయటపెడతామన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్పను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని, అన్ని గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా బీఎస్పీకి ఓటేస్తామని తీర్మానాలు చేయాలని కోరారు. బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, మహిళా కార్యదర్శి విజయ నిర్మల, జిల్లా ట్రెజరర్నవీన్, మోర్ల గణేశ్, రాంప్రసాద్ అసెంబ్లీ అధ్యక్షుడు డోకే రాజన్న, మండల అధ్యక్షుడు లహాంజి, నీలా గౌడ్ పాల్గొన్నారు.
సిర్పూర్ ఓటరుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ టి నియోజకవర్గ ఓటరుగా నమోదు చేసుకున్నారు. కాగజ్ నగర్ పట్టణం ఈద్గా కాలనీలోని మౌంటెయిన్ హైట్స్ నివాసంగా ఆయన ఓటు హక్కు పొందారు. గతంలో ఆలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆయన ఓటు హక్కు ఉండగా.. సిర్పూర్ టి నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా బీఎస్పీ తరపున పోటీ చేయడానికి ఆయన తన ఓటు హక్కును ఇక్కడికి మార్చుకున్నారు.
జాబితాలో ప్రవీణ్ కుమార్ రేపల్లె శివ పేరిట( ఎపిక్ కార్డ్ నంబర్ ఏజేఎన్ 2085538) సీరియల్ నంబర్ 963 కేటాయించారు. ఫాతిమా కాన్వెంట్ లో పోలింగ్ కేంద్రం కేటాయించారు.