దొంగ హామీలిచ్చే కేసీఆర్ ను ఓడించాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

దొంగ హామీలిచ్చే కేసీఆర్ ను ఓడించాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • దొంగ హామీలిచ్చే..కేసీఆర్ ను ఓడించాలి
  • బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు :  దొంగ హామీలతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైన కేసీఆర్​ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బీఎస్పీకి పట్టం కట్టాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కాగజ్ నగర్ తోపాటు మండలంలోని లైన్ గూడ, రాయినిగూడ, మారేపల్లి, అలీగూడలో సోమవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. రీ డిజైన్ పేరుతో ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టు మేడిగడ్డకు తరలిపోయేందుకు స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్పే కారణమని ఆరోపించారు. గోదావరి, ప్రాణహిత జీవనదులున్నా కేసీఆర్ నియంత పాలన కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ ఎడారిగా మారిందన్నారు. 

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లతోపాటు, కేసీఆర్ ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగాలు చేసినవారిలో అత్యధికులు బహుజనులని.. కానీ భోగాలు మాత్రం కేసీఆర్ కుటుంబానికి దక్కాయన్నారు. సిర్పూర్ గడ్డను వలసవాదుల నుంచి విముక్తి  చేసేదాకా విశ్రమించేది లేదన్నారు. కౌటాల మండలం మాజీ ఎంపీటీసీ రత్నం భవుజీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు రాంటెంకి ప్రకాశ్ బీఎస్పీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, కార్యదర్శి సిడెం గణపతి, అసెంబ్లీ అధ్యక్షుడు డోకె రాజన్న, ముస్తఫీజ్ హుస్సేన్, తన్నీరు పోచం, షబ్బీర్ హుస్సేన్ పాల్గొన్నారు.