
- ఎవరు లోకలో, ఎవరు గ్లోబలో ప్రజలే నిర్ణయిస్తరు
- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, బెదిరింపులు
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- బహుజనులను ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఫైర్
కాగజ్ నగర్, వెలుగు : తమ పార్టీ అధికారంలోకి రాగానే పోడు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అడిగిన ఆదివాసీ, గిరిజన రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన దుర్మార్గపు కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఓటర్లను ఆయన కోరారు.
బహుజనులను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు గురువారం కాగజ్ నగర్ లోని బీఎస్పీ కార్యాలయంలో భారీ సంఖ్యలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ మాట్లాడుతూ... ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయకుండా కొంతమందికే సర్కారు పట్టాలిచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, బెదిరింపులకు గురిచేయడం వంటివి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
తాను పుట్టింది అలంపూర్ లో అయినా, మరణించేది సిర్పూర్ గడ్డ మీదనేనని వెల్లడించారు. నవంబర్ 30 ఎన్నికల తర్వాత ఎవరు లోకలో ఎవరు గ్లోబలో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. తన 26 ఏళ్ల పోలీస్ సర్వీస్ లో తాను ఏనాడూ అమాయకులపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయలేదని పేర్కొన్నారు. సిర్పూరు ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే కోనప్ప ఏనాడూ అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు. నకిలీ బంగారు ఉంగరాలు, దళితబంధు, బీసీబంధు, బతుకమ్మ చీరలు వంటి పథకాలతో మోసపోవద్దని ఓటర్లకు ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి పాల్గొన్నారు.
ఇల్లు కొన్నా.. గృహప్రవేశానికి అందరూ రండి..
ఎట్టకేలకు సిర్పూర్ లో చిన్న ఇల్లు కొనుక్కున్నామని సోషల్ మీడియాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ‘‘నిజానికి తెలంగాణతో నా ప్రస్థానం ముడిపడినా.. మీ శేష జీవితం మా వద్దే గడపండి అని నన్ను అక్కున చేర్చుకున్న సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినా తక్కువే. ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు.
చివరి శ్వాస వరకూ మీ మధ్యే ఉంటా. మీ కోసమే శ్రమిస్తా” అని ఆర్ఎస్ ట్వీట్ చేశారు. ఈనెల 29న ఉదయం 11 గంటలకు గృహప్రవేశం ఉంటుందని, సిర్పూర్ విముక్తి కోరుకునే అందరికీ ఇదే తన ఆహ్వానం అని తెలిపారు.