చైర్మన్ నుంచి సీఎం దాకా అందరిపైనా రాజద్రోహం పెట్టాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

చైర్మన్ నుంచి సీఎం దాకా అందరిపైనా రాజద్రోహం పెట్టాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో నిరుద్యోగ భరోసా కార్యక్రమం చేపట్టిన విద్యార్థులను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేయూ విద్యార్థులు మీటింగ్ పెడితే కేసులు పెడుతారా..? అని ప్రశ్నించారు. విద్యార్థులను నిర్బంధించడం దారుణమన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఒక్కరోజైనా సీఎం అడుగుపెట్టారా..? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం తాను కేయూ రాలేదని వివరణ ఇచ్చారు. విద్యార్థి నాయకులను ఉగ్రవాదుల కంటే దారుణంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ తల్లిని కాపాడుకోవడం కోసం విద్యార్థులు మీటింగ్ పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. బయట సమస్యలు లేకుంటే ఇక్కడ నాన్ బోర్డర్లు ఉండరని చెప్పారు. ఇలాంటి సీఎం ఉంటే లీకులు కాకుంటే మరేం అవుతాయి..?    అని సెటైర్ వేశారు. TSPSCని రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ రాశానని చెప్పారు. కేసీఆర్ కు ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదన్నారు. లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 80 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. రాత్రికి రాత్రి జనార్థన్ రెడ్డిని చైర్మన్ చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. 

TSPSC చైర్మన్ జనార్థన్ రెడ్డి... కేసీఆర్, కేటీఆర్ మాటలు విని..మళ్లీ ఎగ్జామ్స్ పెట్టాలని చూస్తు్న్నారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఒకవైపు చైర్మన్ జనార్ధన్ రెడ్డికి, TSPSC సభ్యులకు  సిట్ అధికారులు నోటీసులు ఇస్తుంటే.. వాటికి సమాధానాలు ఇవ్వకుండా ఎగ్జామ్స్ పెడుతామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జనార్థన్ రెడ్డి TSPSC చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీలో ఉన్న వారి పేర్లను అమరవీరుల స్థూపం వద్ద బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లక్ష మందితో టీఎస్ పీఎస్సీ ముట్టడిస్తామని హెచ్చరించారు. 

నిందితుల వద్ద ఆర్థిక లావాదేవీల ఇష్యూ రాకపోతే పేపర్ లీకేజీ విషయం బయటకు రాకపోయి ఉండేదన్నారు. పేపర్ లీకేజీ స్కామ్ లో పెద్ద తలకాయలు ఉన్నాయన్నారు.