తెలంగాణలో అన్ని వర్గాల వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మూడు కోట్ల బహుజన బిడ్డలు డబ్బులు ఇచ్చి.. మన రాజ్యం రావాలి కొట్లాడండి అని చెబుతున్నారని చెప్పారు. వేములవాడలో ఆ దొరపోతే ఈ దొరలు వస్తున్నారు అంటూ మండిపడ్డారు. బీసీ బిడ్డలపై దొరలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టె జనయ్యపై దాడి చేశారని మండిపడ్డారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం.. బహుజన బిడ్డలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దొరలు గాలి మోటార్లలో వస్తే ఖాళీ జగాలు ఉన్నాయి.. వాళ్లు గుట్టలను ఎలా గుల్ల చేయాలనే ఆలోచన చేస్తారు.. మేము గాలి మోటార్లలో వచ్చినప్పుడు.. కింద చూస్తే ప్రతి భూమిని పేద ప్రజలకే పంచాలని చూస్తాము అని అన్నారు.
దొరలు డబ్బులు పంచేందుకు ఓటుకు 2 వేల వరకు పంచేందుకు వస్తారు.. జాగ్రత్తగా ఉండండి అని సూచించారు. దొరలకు ఓట్లు వేయవద్దని పిలుపునిచ్చారు. ఒక్కసారి ఓటును అమ్ముకుంటే మన బిడ్డల జీవితాలను నాశనం చేసినట్టు అవుతుందన్నారు. ఒక్కసారి ఏనుగు గుర్తుకు ఓట్లు వేయండి అని అభ్యర్థించారు. బహుజన రాజ్యం వస్తే భూమి లేని వారికి మహిళ పేరిట ఒక ఎకరం భూమి ఇస్తామని హామీ ఇచ్చారు.
దుబాయ్ లో మన కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొరల కుటుంబాల్లోని వారికి ఎందుకు కష్టాలు రావు.. కేవలం, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికే కష్టాలా..? అని ప్రశ్నించారు. రూ.100 కోట్లు ఢిల్లీకి పంపించి రూ.20 లక్షల వాచ్ను ఎమ్మెల్సీ కవిత పెట్టుకుందని చెప్పారు. బహుజన పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామన్నారు.10 ఏళ్ల నుంచి ఒకే పంట వేస్తే.. పంట దిగుబడి ఎలా రాదో... అలాగే 10 ఏళ్లుగా ఒకే పంటకు తెగులు వచ్చింది.. అందుకే పంట మార్చాలి అని అన్నారు.