- రూ.5 వేల కోట్లు దండుకుని గెలవాలని చూస్తున్న కేసీఆర్
- రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంట్
- గ్రూపు-2 పరీక్షను3 నెలలు వాయిదా వేయాలి
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అయిజ, వెలుగు : రాబోయే ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేసి, ఓట్లు కొనేందుకు సీఎం కేసీఆర్ ముందస్తు మద్యం టెండర్లకు సిద్ధమయ్యారని బీఎస్పీ స్టేట్ చీఫ్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గద్వాల జిల్లా అయిజలో గురువారం ‘ఓటివ్వండి..నోటివ్వండి’ అనే కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. మద్యం టెండర్లతో రూ.5 వేల కోట్లు అక్రమంగా దండుకొని ఆ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ కుట్ర పన్నాడని విమర్శించారు. ఐదేండ్లుగా రైతులకు రుణమాఫీ చేయకుండా కాలయాపన చేసిన కేసీఆర్కు ఎన్నికల ముందే రుణమాఫీ గుర్తుకు రావడం సిగ్గుచేటన్నారు. రుణమాఫీ సకాలంలో చేయకపోవడం వల్ల రైతులకు వడ్డీ భారం పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
రుణమాఫీ కోసం రూ.19 వేల కోట్లు 45 రోజుల్లో సర్దుబాటు చేయడం ప్రభుత్వానికి సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.12 వేల కోట్లు ఆదాయం వస్తే, ఉద్యోగుల జీతభత్యాలకే రూ.4 వేల కోట్లు పోతున్నాయన్నారు. మిగిలిన రూ.8 వేల కోట్లతో కేవలం రుణమాఫీ చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ ఇటువంటి ప్రకటనలు చేయడం ఎన్నికల స్టంట్ గా అభివర్ణించారు. ఎన్నికల ముందే కేసీఆర్కు పథకాలు గుర్తుకొస్తున్నాయన్నారు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం హర్షణీయమన్న ఆయన ఆర్టీసీ ఆస్తులు, భూములు అమ్ముకోవడం కోసమే కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడన్నారు. ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల బోర్డు పరీక్షల షెడ్యూల్ ఉండడం వల్ల మరో మూడు నెలలపాటు గ్రూప్ –2 పరీక్షను వాయిదావేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎంసీ కేశవ రావు, నియోజకవర్గ ఇన్ చార్జి మధు గౌడ్, మహిళా కన్వీనర్ నాగజ్యోతి, అలంపూర్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ శోభ గౌడ్, మాధురి, అయిజ మండల అధ్యక్షులు వీరన్న, స్వామిదాస్, చిన్న పాల్గొన్నారు.