జగదీష్ రెడ్డికి వట్టే జానయ్య భయం పట్టుకుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నల్లగొండ జిల్లా : సూర్యాపేటలో డీసీఎంఎస్ చైర్మన్  వట్టే జానయ్య తల్లిని పరామర్శించడానికి వెళ్తున్న తమకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సూర్యాపేట పట్టణం కాశ్మీర్ కాదని, తాము ఉగ్రవాదులం కాదన్నారు. బీఎస్పీ పార్టీని చూసి మంత్రి జగదీష్ రెడ్డి భయపడుతున్నారని చెప్పారు. వట్టే జానయ్య విషయంపై వాస్తవాలు మాట్లాడుకోవడానికి చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఈ విషయంలో తాను ఎక్కడకు రమ్మంటే అక్కడకు వచ్చి చర్చిస్తానని చెప్పారు. డీసీఎంఎస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అణిచివేతకు గురైనా బీఎస్పీ పార్టీ తరఫున తాము పోరాటం చేస్తామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వట్టే జానయ్య కు అన్యాయం జరిగిందన్నారు. కొందరు రాజకీయ నాయకులు కార్యకర్తలను వాడుకుని.. అవసరం తీరాక వదిలేస్తారని.. వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తారని చెప్పారు. ఆత్మగౌరవం చంపుకుని పని చేయాల్సిన అవసరం లేదన్నారు. బహుజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా తాము ప్రశ్నిస్తామన్నారు.

మొత్తం తెలంగాణ సమాజానికి జానయ్య తల్లి వట్టే అయిలమ్మ స్ఫూర్తి ఇచ్చారని, ఆమెకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గాంధీనగర్ లో ఆంక్షల నడుమ సమావేశం నిర్వహించాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొందన్నారు. సూర్యాపేటకు వెళ్తుంటే తమను అడుగడుగునా పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీనగర్ కాశ్మీర్ లో ఉందా..? లేక తెలంగాణలో ఉందా..? అని ప్రశ్నించారు. మంత్రి జగదీశ్ రెడ్డి అడుగడుగునా పోలీసు ఆంక్షలు పెట్టించారని ఆరోపించారు. జానయ్యపై కేసులు నమోదైనప్పటి నుంచి ఆయన ఇంటికి  కరెంట్ బంద్ చేశారని చెప్పారు. 

ఆగస్ట్ 25వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించిన బీసీ గర్జన కార్యక్రమానికి జానయ్య హాజరుకావడంతో మంత్రి జగదీష్ రెడ్డికి భయం మొదలైందన్నారు. జానయ్య కొడుకు పెళ్లికి 50 వేల మంది వస్తే.. బీసీ బిడ్డ ఇంటికి 50 వేల మంది ఎలా వస్తారని జగదీష్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. బీసీ బిడ్డలు అగ్రవర్ణ కులాల కింద చెప్పులుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయాలు అంతా రెడ్ల చేతుల్లోనే నడుస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు బానిస బతుకులు బతకాలని రెడ్లు శాసిస్తున్నారని ఆరోపించారు. 

తాను 26 సంవత్సరాలు పోలీస్ శాఖలో పని చేశానని, ఎప్పుడు కూడా ఇలాంటి నిర్బంధపు ఆంక్షలు చూడలేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అధికార పార్టీ నాయకులు అరెస్ట్ చేయమంటే చేస్తున్నారని, కేసులు పెట్టమంటే పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. తల్లిని పరామర్శించడానికి వెళ్తుటే ఆంక్షల మధ్య అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణిచి వేసేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

బీఆర్ఎస్ పార్టీలోని డీసీఎంఎస్ నాయకుడు, అతని భార్య అజ్ఞాతంలోకి వెళ్లిపోతే సీఎం కేసీఆర్, రాష్ట్ర డీజీపీ, హోంశాఖ మంత్రి ఎక్కడు ఉన్నారు..? ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వట్టే జానయ్యను మంత్రి జగదీశ్ రెడ్డి  మనుషులు చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 30 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు తీసుకొని రూ.100 కోట్లకు అమ్ముకున్న కేసీఆర్ పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.