రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం కేసీఆర్​కు లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు : సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని, తుమ్మిడిహట్టి నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ పూర్తయినా ప్రాజెక్టు కంప్లీట్​ చేయకుండా కాళేశ్వరం పేరుతో మేడిగడ్డకు తరలించారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని వీరవెల్లి, లోనవెల్లి, సాండ్ గాం, పార్డీ, తుమ్మిడిహట్టిలో పర్యటించారు .

ఆయన మాట్లాడుతూ ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే తుమ్మిడిహట్టి, సాండ్ గాం, రణవల్లి, కోర్సిని, గూడెం, హుడికిలి, లోనవెల్లి, సూర్జాపూర్, జంబుగ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం, చిత్తశుద్ధి కేసీఆర్ ప్రభుత్వానికి లేదన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి కేసీఆర్ ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి చర్లపల్లి జైలుకు పంపుతామన్నారు.

అంతకుముందు కాగజ్ నగర్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా నాయకులు రామటెంకి నవీన్, మండల అధ్యక్షుడు బండు పటేల్, దుర్గం వెంకటేశ్, సాయినాథ్  పాల్గొన్నారు.