ఓట్లు మావి.. సీట్లు మీవా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నల్గొండ జిల్లా: తెగిస్తే తానీషాలవుతాం.. భరిస్తే బానిసలవుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీని గెలిపిస్తే చక్రవర్తులమవుతామని స్పష్టం చేశారు. మునుగోడులో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. మునుగోడు ఎన్నికలో బహుజనులకు లిక్కర్ తాపిస్తూ వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రూ.125 కోట్ల రూపాయల లిక్కర్ ను తాపించి బహుజన ప్రజల బతుకులతో ఆడుకున్నారని ఫైర్ అయ్యారు. డబ్బు, మందు పంచుతూ బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. యాదవ ప్రజలకు అట్ట పెట్టెలో అన్నం పెట్టి టీఆర్ఎస్ పార్టీ అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన మగ్గంపై కాలు పెట్టి వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నేతన్నలను అవమానించారని మండిపడ్డారు. ఇంకెంత కాలం బహుజనుల బతుకులతో ఆడుకుంటారని ప్రశ్నించారు. 

70 ఫీట్లు నడవనోడు 70 వేల మందితో మీటింగ్ పెడ్తాడా?

70 ఫీట్లు నడవనోడు 70 వేల మందితో మీటింగ్ పెడుతున్నాడట అని సీఎం కేసీఆర్ ను విమర్శించారు. చండూర్ ను దత్తత తీసుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటని, ఈ ఎనిమిదేళ్లు మునుగోడును అభివృద్ధి చేయకుండా గడ్డి పీకారా అని విమర్శించారు. తమ సభకు ప్రజలను రానీయకుండా బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని, అయినా వేల సంఖ్యలో బీఎస్పీ సభకు ప్రజలు వచ్చారని చెప్పారు. దేశాన్ని నడిపేది స్వామీజీనా... మోడీనా అని ప్రశ్నించారు. బీఎస్పీ ర్యాలీ చూసి బీజేపోళ్లు భయపడ్డారని, మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు. 20 ఏళ్ల డొక్కు కారును ఎవరూ నడిపించరని టీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు. వందేళ్లైనా ఏనుగుకు ఢోకా లేదని స్పష్టం చేశారు. ఓట్లు మావి సీట్లు మీవా అంటూ ప్రశ్నించారు. బహుజనులందరూ బీఎస్పీని ఆదరించాలని కోరారు. డబ్బులెవరూ ఇచ్చినా తీసుకోవాలని ఓటు మాత్రం  ఏనుగు గుర్తుకు వేసి  బీసీ బిడ్డ శంకరాచారిని గెలిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.