మునుగోడు, వెలుగు : బీజేపీ బీసీల కుల గణన చేయకుండా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారి వాటా వారికి రాకుండా అడ్డుకుంటోందని..మళ్లీ మునుగోడులో ఎలా ఓట్లు అడుగుతున్నారని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారో ఆధిపత్య పార్టీలు లెక్కించడం లేదన్నారు. మునుగోడులోని సత్య ఫంక్షన్ హాల్ లో జరిగిన విశ్వకర్మ, బీసీ కులాల సంయుక్త సమ్మేళనానికి ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు.
బీఎస్పీ ఎవరికీ బి టీమ్ కాదని ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ప్రభుత్వం బీసీల కోసం రూ.2,433 కోట్లు కేటాయించి కేవలం రూ.7 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి బడ్జెట్ కూడా కేటాయించలేదన్నారు. వడ్రంగులపై అటవీ అధికారులు అక్రమ కేసులు పెడుతుంటే, నేతన్నలపై జీఎస్టీ భారం మోపారన్నారు. బీజేపీ దొంగ పార్టీలను బరిలో దింపి నీచ రాజకీయాలు చేస్తుంటే, టీఆర్ఎస్ ఆర్ఓ లను బెదిరిస్తోందన్నారు. ఏనుగు గుర్తుకు ఓటేసి శంకరాచారిని గెలిపించాలని కోరారు. అభ్యర్థి ఆందోజు శంకరాచారి, సభాధ్యక్షుడు సత్యనారాయణ, జగన్నాథం, ఊరుమల్ల విశ్వం,దాసరి ఉష, అరుణ, సాంబశివ గౌడ్, సంజయ్, పద్మ యాదవ్, షఫీ పాల్గొన్నారు.