సూర్యాపేట: గురుకుల విద్యార్థిని వైష్ణవి మృతిపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం సూర్యపేటలో గురుకుల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గురుకుల పాఠశాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగిన వైష్ణవి కుటుంబ సభ్యులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించి వారు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరిలో ఇద్దరమ్మాయిలు అనుమానాస్పదంగా మరణించిన ఘటన మరవక ముందే సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వైష్ణవి చనిపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ప్రకటించిన "ఆరు గ్యారంటీల" అమలు కాదు.. మా బిడ్డల ప్రాణాలకు “గ్యారంటీ” కావాలని పుట్టెడు శోకంలో బాధాతప్త హృదయాలతో మృతురాలి తల్లిదండ్రులు నినదిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెండ్డి.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదని విమర్శించారు. ఈ బిడ్డల గోడు ఎవరికి చెప్పుకోవాలి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో అన్నీ చర్చిస్తున్నారు కానీ.. గురుకుల వసతి గృహాల్లో వరుస ఆత్మహత్యలపై మాత్రం చర్చ జరగడం లేదు.. ఎందుకు?, ఈ బిడ్డల ప్రాణాలకు విలువలేదా?.. ప్రజా పాలన అంటే ఇదేనా? అంటూ ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని... కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఇందుకోసమేనా.. గత ప్రభుత్వంలో వరుస ఘటనలు జరిగాయి.. మళ్లీ కొత్త ప్రభుత్వంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని.. వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలన్నారాయన. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్.. తన వద్ద ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు తక్షణమే మంత్రులను నియమించాలన్నారు.