ఒక పాస్ పోర్ట్ దొంగ.. కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు దోచుకున్నాడు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

ఒక పాస్ పోర్ట్ దొంగ..  కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు దోచుకున్నాడని కేసీఆర్ పై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో  విరుచుకుపడ్డారు. సిరిసిల్ల పట్టణం కాలేజీ మైదానంలో బిఎస్పీ పార్టీ సింహగర్జన భహిరంగ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.  వచ్చే ఎన్నికల్లో  కెసిఆర్ ఓడిపోతే రెస్ట్ తీసుకొనివ్వమని.. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి గుంజుకపోయి జైల్లో వేస్తామన్నారు. 

జైల్లో వేసే కార్యక్రమం సిరిసిల్ల నుండి పునాది వేశామని అన్నారు. తెలంగాణలో బిసి అభ్యర్థులకు 60శాతం టిక్కెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అన్నారు.అన్ని కులాలను అక్కున చేర్చకొని టిక్కెట్లు ఇస్తామని.. వరంగల్ తూర్పు లో ఒక ట్రాన్స్ జెండర్ ని పోటీలో నిలబెడుతున్నామని చెప్పారు. ప్రగతి భవన్ లో బహుజనుడు కూర్చునే వరకు మా పోరాటం ఆగేది లేదని చెప్పారు. 

సిరిసిల్లలో కేటీఆర్ కు ప్రభుత్వ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మీడియాలో వస్తున్న సర్వేలు దొంగవని.. వాటిని ఎవరు నమ్మద్దన్నారు. బండి సంజయ్ సిరిసిల్లలో పద్మశాలిలకు టికెట్ ఇస్తా అని హామీ ఇచ్చారు.. కానీ ఇప్పుడు రాణి రుద్రమకు టికెట్ ఇచ్చి మోసం చేశారన్నారు.  వేములవాడ దేవుడి సొమ్ము కామారెడ్డికి తలలిస్తున్న దొంగలను గెలిపిద్దామా..? అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు.  

తెలంగాణ మట్టిలో పుట్టిన బిడ్డలకు టిక్కెట్లు ఇస్తున్నామని.. వారిని గెలిపించాలని ప్రవీణ్ కుమార్ కోరారు.  కేటీఆర్ సిరిసిల్లలో వేల ఎకరాలు అమ్ముకొని దందా చేస్తున్నాడని ఆరోపించారు. బీఎస్పీ అభ్యర్థిని గెలిపిస్తే.. కేటీఆర్ ను మానేరు డ్యాంలో కలిపెస్తానని.. ఇది నా హామీ అని.. నెరవేర్చకపోతే తనను తుపాకీతో కాల్చండని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరం ఉన్నవారు.. తెలంగాణ దోపిడి దారులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సభలకు వెళ్ళకండని చెప్పారు. దోచుకున్న సొమ్ము ఎక్కడ ఉందని ప్రజలు నిలదీయాలన్నారు. 

ఆది శ్రీనివాస్.. గోలి మోహన్ కు అవకాశం ఇవ్వాలని, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియని కాంగ్రెస్ లో ఉన్నావన్నారు. మేడిగడ్డ లీకు, లిక్కర్ లీకు, పేపర్ లీకు.. ఈ లీకు వీరుడిని తరిమికొట్టాలని అన్నారు. మేం అధికారంలోకి వస్తే ఎర్రవెల్లి నుండి చర్లపల్లి కి రోడ్డు వేస్తామన్నారు.  హుజూరాబాద్ లో ఒక్క ముదిరాజ్ ను ఓడించాలని రూ.500  కోట్లు ఖర్చు చేస్తే మన జన బలం ముందు.. మీ దన బలం ఓడిపోయింది బిడ్డ అని కేసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు.