దళితబంధు బీఆర్ఎస్ బంధుగా మారింది... ఉచిత విద్యుత్పై బీఆర్ఎస్, కాంగ్రెస్ వి డ్రామాలు..

ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటిస్తున్న కేసీఆర్కు.. తొమ్మిదేళ్ల పాలనలో పేద ప్రజలు గుర్తుకు రాలేదా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 20 వేల మంది కౌలు రైతులను బిఅర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదని నిలదీశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు చిల్లిగవ్వ కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. దళిత బంధు బిఅర్ఎస్ పార్టీ బంధుగా మారిందని ఆరోపించారు.  దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను బిఅర్ఎస్ నేతలు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిర్వహించిన బహుజన రాజ్యాధికార యాత్రలో అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ALSO READ :గెస్ట్ లెక్చరర్ల ఆందోళన... అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలె

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై బిఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కమార్ మండిపడ్డారు.  రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు  పనిముట్లు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రూ. లక్ష రుణమాఫీ వెంటనే చేయాలన్నారు.  రాష్ట్రంలో కేసీఆర్ దొరల పాలన  సాగిస్తున్నారని విమర్శించారు. 

రానున్న ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.  ఏ పార్టీతో  పొత్తులు పెట్టుకోమని తెలిపారు. బీసీలకు 60 నుండి 70 సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని చెప్పారు. బహుజనులకు రాజ్యధికారం కావాలంటే బీఎస్పీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.