- బీఎస్పీ స్టేట్ చీఫ్ కు సిర్పూర్ కలిసొచ్చేనా?
- బహుజనుల ఓట్లపైనే .. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధీమా
- గతంలో ఏనుగు గుర్తుపై గెలిచిన కోనేరు కోనప్ప
- ఇప్పుడు ఓట్ల చీలిక కలిసివస్తుందనే అంచనా
- చాపకింద నీరులా సాగుతున్న స్వేరోస్ ప్రచారం
ఆసిఫాబాద్, వెలుగు: బహుజన వాదాన్ని భుజానెత్తుకొని అధికార బీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్న బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందు నుంచీ చెప్తున్నట్లుగానే ఆసిఫాబాద్ జిల్లాలోని జనరల్ నియోజకవర్గమైన సిర్పూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప లాంటి బలమైన అభ్యర్థితో ఆయన తలపడనుండడం ఆసక్తి రేపుతోంది. అయితే, సిర్పూర్‌ను ఎంచుకోవడం వెనుక ప్రవీణ్ కుమార్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో 90 శాతానికిపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కోనప్ప 2014లో బీఎస్పీ తరఫున ఏనుగు గుర్తుపై పోటీ చేసి గెలవడం కూడా ప్రవీణ్‌కుమార్‌కు కలిసివచ్చే అం శంగా భావిస్తున్నారు.
బహుజన ఓట్లే కీలకం
సిర్పూర్ సెగ్మెంట్లో 2,22,973 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2.10 లక్షలకుపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లే ఉన్నారు. అభ్యర్థుల విజ యంలో ఈ ఓటర్లే కీలకపాత్ర పోషిస్తారు. కొంతకాలంగా అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రవీణ్ కుమార్.. దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనారిటీల పక్షాన గళం విప్పుతున్నారు. బహుజనులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో పాటు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయంపైనా ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇంటర్మీడియెట్ స్టూడెంట్లకు ఉచిత భోజనం లాంటి సేవా కార్యక్రమా లతో కోనప్ప యువతకు దగ్గరయ్యారు. ఇప్పుడా యూత్ తమవైపు మళ్లుతున్నారని ప్రవీణ్ అనుచరులు
చెప్తున్నారు.
ఓట్ల చీలిక పైనా ఆశలు
ప్రవీణ్ కుమార్ రంగప్రవేశంతో సిర్పూర్లో చతుర్ముఖ పోటీ ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాల ఓట్ల చీలికపై బీఎస్పీ ఆశలు పెట్టుకున్నది. ముఖ్యంగా నియోజకవర్గంలో 25 శాతం దాకా ఉన్న ఎస్సీ, మైనారిటీ ఓటర్లలో 90 శాతానికిపైగా బీఎస్పీకి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 15 శాతం ఉన్న ఆదివాసీ ఓట్లు బీఆర్ఎస్, బీఎస్పీ, కాంగ్రెస్ మధ్య చీలిపోయే అవకాశం ఉంది. ఎస్టీ ఓట్లను సైతం గంపగుత్తగా కొల్లగొట్టేందుకు ప్రవీణ్ కుమార్ వ్యూహం రచిస్తున్నారు. ఇక 50 తానికిపైగా ఉన్న బీసీ ఓట్లలో సగానికి పైగా సాధించాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు అనుచరులు చెప్తున్నారు. బీసీల్లోని ఆరె, బారె వర్గాలు, బెంగాలీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తనదైన శైలిలో బీఎస్పీ ముందుకు సాగుతున్నది. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్పపైనా, బీఆర్ఎస్ సర్కారుపైనా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో బీఎస్పీ లీడర్లు ఉన్నారు. మరోవైపు గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రవీణ్‌కుమార్ ఏర్పాటుచేసిన స్వేరోస్ నాయకులు ఇప్పటికే సిర్పూర్లో దిగి, చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు.