భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి నేడు. ఈ సందర్భంగా బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. బహుజన రాజ్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జనవరి 3వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు.
సావిత్రిబాయి పూలే.. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా కందారా తాలూకాలోని నయాగావ్ గ్రామంలో కండోజి సేవనే పాటిల్ లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. మహాత్మా జ్యోతిరావు పూలే తో వివాహం జరిగింది. అప్పటివరకు అక్షరం జాడ తెలియని సావిత్రి బాయి పూలే భర్త ప్రోత్సాహంతో తన దగ్గరే చదవడం, రాయడం నేర్చుకున్నారు. భర్త ఆశయాల సాధన కోసం ఆయనతో కలిసి నడిచారు. ఆడపిల్లలకు చదువు అనే ఆలోచనే లేని కాలంలో చదువులను వాడవాడల్లోకి ప్రతి గడపలోకి తీసుకెళ్లారు. అన్ని కులాల వారు చదువుకోవడానికి పాఠశాలను స్థాపించారు.
1852లో ఒక మహిళా మండలిని కూడా స్థాపించి ఈ మండలి ద్వారా కులమత వివక్షతను పోగొట్టడానికి సావిత్రిబాయి పూలే చాలా కృషి చేశారు. సంప్రదాయక పండగలన్నింటినీ గౌరవించి మూఢాచారాలను రూపుమాపగలిగారు. వితంతువుల కోసం 1863లో ఒక శరణాలయాన్ని స్థాపించారు. పూలే దంపతులకు సంతానం లేకపోవడంతో కాశీబాయి అనే వితంతువు కుమారుడిని దత్తత తీసుకొని యశ్వంత్ అని పేరు పెట్టి కన్న కొడుకు లాగే పెంచి ప్రయోజకుడిని చేశారు. బాల వితంతువులందరినీ దగ్గరకు చేర్చి ఆశ్రయం కల్పించి విద్యను నేర్పిస్తూ జీవనోపాధిని కూడా కల్పించారు.