బహుజనులపై దాడులు చేస్తే ఊరుకోం : ఆర్ఎస్ ప్రవీణ్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గడీల పాలన సాగిస్తున్నాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజనులకు తాము అండగా ఉంటామని.. పోలీసులను అడ్డుపెట్టుకుని ఏమైనా చేయాలని చూస్తే జగిత్యాల అగ్నిగుండంగా మారుతుందని వార్నింగ్ ఇచ్చారు. తంతే కూలిపోయే గోడలు బహుజనులను అడ్డుకోలేవని అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణిని ఇంటికెళ్లి పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక రాజీనామా చేసిన ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో రాజరిక పాలన నడుస్తోందనడానికి శ్రావణికి జరిగిన అవమానమే ఉదాహరణ అని  చెప్పారు. 

జగిత్యాల ఎవరి సొత్తూ కాదని.. సంజయ్ కుమార్ రాజరికపు పాలనకు చరమగీతం పాడాలని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజలు.. బహుజనుల సమావేశాలకు రాకుండా ప్రభుత్వ అధికారులు డబ్బులు పంచుతున్నారని.. వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బహుజనుల,పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని చూస్తే తాము ఊరుకోమని స్పష్టం చేశారు.