గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నరు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు :  జడ్పీ చైర్మన్, చైర్​పర్సన్​ ​పదవులను ఆదివాసీలకు కేటాయిస్తే వాటిని ఆధిపత్య కులాల వారు ఆక్రమించుకుని తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్​అయ్యారు. ఆసిఫాబాద్​జడ్పీ చైర్మన్​పదవికి మళ్లీ ఎన్నిక నిర్వహించాలని బుధవారం ఆదివాసీలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయగా ప్రవీణ్​కుమార్​వారికి మద్దతు పలికి మాట్లాడారు. ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసిన ఆసిఫాబాద్ జడ్పీకి చైర్​పర్సన్​గా ఉన్న కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా గెలవగా,  ఆ స్థానంలో జడ్పీ వైస్​చైర్మన్​గా ఉన్న కోనేరు కృష్ణారావు బాధ్యతలు తీసుకోవడంపై మండిపడ్డారు. 

భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ ​పీఠాన్ని ఎస్టీ జనరల్​కు కేటాయించగా..కోరం కనకయ్య ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కంచర్ల చంద్రశేఖర్ రావు కుర్చీపై కూర్చోవడం ఏమిటన్నారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఏజెన్సీ ఏరియాలో ఎస్టీలకు రిజర్వ్ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ల స్థానాల్లో జనరల్ కేటగిరీకి చెందిన జడ్పీ వైస్​చైర్మన్లను తాత్కాలిక చైర్మన్లుగా నియమించడం ఎస్టీల హక్కులను కాలరాయడమేనన్నారు. 

ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి చేసి జైలు పాలైన గూండా కోనేరు కృష్ణారావును ఆసిఫాబాద్ జెడ్పీ చైర్మన్​గా ఎంపిక చేయడాన్ని ఖండించారు. వీటన్నింటికి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆసిఫాబాద్, కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించి ఎస్టీలను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జనవరి10 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు.  జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో ఆదివాసీలకు కల్పించిన హక్కులు వారు పూర్తిగా కోల్పోయారన్నారు. 

ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజనులకు ఉద్యోగాల్లో  రిజర్వేషన్‌ పోయిందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి ఆర్డినెన్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి  సారించాలన్నారు. ఆదివాసీలు పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. తర్వాత కలెక్టరేట్​లో వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శులు అర్షద్ హుస్సేన్, సిడెం గణపతి, జిల్లా అధ్యక్షుడు లెండుగురే శ్యామ్ రావు, లీడర్లు సోయం చిన్నయ్య, కనక ప్రభాకర్, బన్సీలాల్ రాథోడ్, మెస్రం జంగు బాపు, జ్యోతి , రాంప్రసాద్, దుర్గం ప్రవీణ్, గణేశ్, తిరుపతి పాల్గొన్నారు.