
తెలంగాణలో బీసీలు రాజకీయ వివక్షకు గురవుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇందుకు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యనే ఉదాహరణ అని చెప్పారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడం బాధాకరం అని చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమే అయినా ఆయన నిర్ణయాన్సి స్వాగతిస్తున్నానని ట్వీట్ చేశారు.
అగ్రకుల, ఆధిపత్య పార్టీల జెండాలు, అజెండాలు ఎన్నేళ్లు మోసినా చివరకు BC,SC,ST నాయకులకు మిగిలేది అవమానాలు,అనుమానాలు మాత్రమే అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్,BJP,BRS పార్టీలకు బీసీల ఓట్లు మాత్రం కావాలి... కానీ,బీసీలకు జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ,పార్లమెంటు సీట్లు మాత్రం కేటాయించరని... ఇది కాదా కుల వివక్ష? అని ప్రశ్నించారు.
తెలంగాణ జనాభాలో 4 శాతం ఉన్న రెడ్లకు 43 అసెంబ్లీ సీట్లు, ఒక్క శాతం కూడా లేని వెలమలకు 16 అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ కేటాయించిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుంచి ఇంతకంటే ఎక్కువ ఊహించలేం కదా! అని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడం రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న రాజకీయ వివక్షకు నిదర్శనం. ఈ రాజీనామా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమే అయినా రాజీనామాను స్వాగతిస్తున్నాను.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 13, 2023
అగ్రకుల, ఆధిపత్య పార్టీల…
బీసీలకు జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లు కేటాయించడంలో అన్ని పార్టీలు వివక్ష చూపుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కానీ రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ మాత్రమే బీసీలకు జనాభా ప్రాతిపదికన 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా ఫూలే కలలు కన్న బహుజన రాజ్య స్థాపన కోసం బీఎస్పీలో చేరాలని కోరారు. ఆత్మగౌరవంతో మన ఓట్లు మనమే వేసుకుని రాజ్యాధికారాన్ని సాధిద్దామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.