బీమా కోసం ఫ్రెండ్ ను చంపాడు
తానే చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశాడు
పంజాబ్‌లో ఘటన
చండీగఢ్ : రూ. 4 కోట్ల బీమా డబ్బులు పొందడానికి ఫ్రెండ్ ను హత్య చేసి..తానే చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశాడో వ్యక్తి. ఈ ఘటన పంజాబ్‌లోని రాందాస్ నగర్ లో చోటుచేసుకుంది. రాందాస్ నగర్ కు చెందిన గురుప్రీత్ సింగ్, అతని భార్య ఖుష్‌దీప్ కౌర్ బిజినెస్ చేస్తూంటారు. వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో తన పేరు మీద ఉన్న రూ.4 కోట్ల బీమాను ఎలాగైనా క్లెయిమ్ చేయాలని గురుప్రీత్ నిర్ణయించుకున్నాడు. చూడటానికి తనలాగే ఉన్న సైన్‌పూర్ నివాసి సుఖ్‌జీత్‌ను చంపి.. తానే చనిపోయినట్లు నమ్మించాలని.. తన భార్యతో పాటు మరో నలుగురితో కలిసి ప్లాన్ వేశాడు.
సుఖ్‌జీత్‌ను చంపాలనే కుట్రతో అతనితో ఫ్రెండ్ షిప్ చేశాడు. కొన్ని రోజులు చాలా స్నేహంగా ఉన్నాడు. జూన్ 19న సుఖ్‌జీత్‌కు గురుప్రీత్ బాగా మద్యం తాగించాడు. స్పృహ తప్పి పడిపోయాక హత్య చేశాడు. అనంతరం తన బట్టలను డెడ్ బాడీకి తొడిగాడు. తర్వాత మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ట్రక్కు కింద వేసి నుజ్జు నుజ్జు చేయించాడు. మరుసటి రోజు తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని గురుప్రీత్ భార్య ఖుష్‌దీప్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుఖ్‌జీత్ మృతదేహాం తన భర్తదేనని నమ్మించింది. అయితే, కొన్ని రోజులుగా సుఖ్‌జీత్ కనిపించడం లేదంటూ అతని భార్య జీవన్‌దీప్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గురుప్రీత్ తన భర్తకు రోజూ మద్యం తాగిస్తున్నాడని పేర్కొంది. దీంతో గురుప్రీత్ ఫ్యామిలీని అనుమానించిన పోలీసులు మళ్లీ విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అంతా కలిసి హత్య చేశారని గుర్తించారు. దీంతో గురుప్రీత్ తో పాటు అతని భార్యను, సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.