మందు తాగేందుకు రూ.వెయ్యి ఖర్చు.. షేరింగ్లో గొడవ.. నిజామాబాద్‌‌లో ఇద్దరు హత్య

మందు తాగేందుకు రూ.వెయ్యి ఖర్చు.. షేరింగ్లో గొడవ.. నిజామాబాద్‌‌లో ఇద్దరు హత్య

నిజామాబాద్, వెలుగు : మందు తాగేందుకు పెట్టిన రూ. వెయ్యి ఖర్చును సమానంగా షేర్‌‌ చేసుకునే విషయంలో గొడవ జరగడంతో ఇద్దరు ఫ్రెండ్స్‌‌ కలిసి మరో స్నేహితుడిని చంపేశారు. అతడు కనిపించకపోవడంతో మరో ఫ్రెండ్‌‌ ఆరా తీయగా, హత్య విషయం బయటపడుతుందన్న భయంతో అతడిని సైతం హత్య చేశారు. నిజామాబాద్‌‌ నగరంలో ఇటీవల వెలుగు చూసిన రెండు హత్యలకు సంబంధించిన వివరాలను ఏసీపీ రాజా వెంకట్‌‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. 

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌‌ పట్టణానికి చెందిన అమీర్‌‌ఖాన్‌‌, రియాజ్‌‌ఖాన్‌‌, మహ్మద్‌‌ బహదూర్‌‌, సయ్యద్‌‌ యూసుఫ్‌‌ ఫ్రెండ్స్‌‌. వీరు నలుగురు శ్మశానవాటికల్లో తిరుగుతూ కాల్చేసిన శవాల బూడిద నుంచి బంగారం, వెండి వెతుక్కుంటూ జీవిస్తుంటారు. ఈ నెల 18న అమీర్‌‌, రియాజ్‌‌, మహ్మద్‌‌ బహదూర్‌‌ కలిసి ఆర్మూర్‌‌ రోడ్డులో ఓ చోట మద్యం తాగారు. 

బండి పెట్రోల్‌‌, మందుకు రూ. వెయ్యి ఖర్చు అయిందని, దీనిని ముగ్గురం సమానంగా షేర్‌‌ చేసుకుందాని అమీర్‌‌ చెప్పడంతో రియాజ్‌‌ అంగీకరించగా, బహదూర్‌‌ వ్యతిరేకించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అమీర్‌‌, రియాజ్‌‌ కలిసి కర్రతో కొట్టి బహదూర్‌‌ను హత్య చేశారు. తర్వాత ఇద్దరూ కలిసి ఇండ్లకు వెళ్లిపోయారు. 19న సయ్యద్‌‌ యూసుఫ్‌‌.. అమీర్‌‌, రియాజ్‌‌ను కలిసి బహదూర్‌‌ ఎక్కడ ? అని ప్రశ్నించాడు. 

దీంతో హత్య విషయం బయటపడుతుందని భావించిన ఇద్దరు యూసుఫ్‌‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో స్నానం చేద్దామని నమ్మించి యూసుఫ్‌‌ను సమీపంలోని జాలీ తలాబ్‌‌కు తీసుకెళ్లి నీటిలో ముంచి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో రెండు హత్యలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్‌‌ చేశారు. సెల్‌‌ఫోన్‌‌ సిగ్నల్స్‌‌, ఇతర ఆధారాల ఆధారంగా అమీర్‌‌, రియాజ్‌‌ను అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు.