
- మహాకుంభమేళాలో పనిచేసిన హెల్త్, శానిటేషన్ సిబ్బందికీ యూపీ సీఎం యోగి నజరానా
- పోలీసులకు మహా కుంభ్ మెడల్, 7 రోజుల సెలవులు
- పొలిటికల్ విల్ ఉంటే ఏమైనా సాధించగలమన్న సీఎం
- ముగిసిన 45 రోజుల మెగా ఈవెంట్.. మొత్తం 66 కోట్ల మంది పుణ్యస్నానాలు
ప్రయాగ్ రాజ్/మహాకుంభ్ నగర్: మహాకుంభమేళాలో పోలీసులు, పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్లు ఎనలేని సేవలు చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. కోట్లాది మంది భక్తులు వచ్చినా.. వారు ఎంతో ఓపికగా విధులు నిర్వహించినందుకే కుంభమేళా గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. అందుకే వీరందరి సేవలకు గుర్తింపుగా రూ. 10 వేల చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించారు.
కుంభమేళాలో 75 వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారని, వారందరికీ మహా కుంభ్ మెడల్, 7 రోజుల సెలవులు కూడా ఇస్తామన్నారు. గత నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళా 45 రోజుల పాటు కొనసాగి.. బుధవారం మహాశివరాత్రి రోజు ముగిసింది. గురువారం మహాకుంభ్ వద్ద సీఎం యోగి గంగాపూజ నిర్వహించి, అధికారికంగా కుంభమేళాకు ముగింపు పలికారు.
రాష్ట్ర మంత్రులు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కలిసి సీఎం యోగి పూజలు చేశారు. కుంభమేళా వద్ద కార్మికులతో కలిసి కాసేపు చెత్తను క్లీన్ చేశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసు, పారిశుధ్య, హెల్త్ కార్మికులతో పాటు అధికారులు కలిసికట్టుగా పనిచేయడం వల్లే కుంభమేళా సక్సెస్ అయింది. రాజకీయ సంకల్పం ఉంటే ఏమైనా సాధించవచ్చని అధికార యంత్రాంగం నిరూపించింది.
ప్రధాని విజనరీ నాయకత్వానికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. అలాగే కుంభమేళా గురించి ప్రపంచానికి వివరించడంలో మీడియా కీలకపాత్ర పోషించింది” అని సీఎం యోగి కొనియాడారు.
శానిటేషన్ వర్కర్లకు రూ. 16 వేల జీతం..
ఏప్రిల్ నుంచి శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనాన్ని రూ.16 వేలకు పెంచుతామని యోగి ప్రకటించారు. తాత్కాలిక హెల్త్ వర్కర్లకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ ఫర్స్, ఆయుష్మాన్ భారత్ పథకాలు అమలు చేస్తామన్నారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని సీఎం మండిపడ్డారు. 30 మంది చనిపోతే, వందల మంది చనిపోయారంటూ నేపాల్ తొక్కిసలాట వీడియోలు పోస్టు చేశారని విమర్శించారు.
కాగా.. కుంభమేళా ప్రాంతంలో అధికారులు పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 66.3 కోట్ల మంది యాత్రికులు మేళాలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. ఇక మహాకుంభమేళాలో నిర్వహిస్తున్న మెగా నేత్ర శిబిరాన్ని సీఎం యోగి సందర్శించారు. శిబిరానికి వచ్చిన వారితో ఆయన మాట్లాడారు.