ఎకరానికి రూ.10వేల సాయం.. కేంద్రానికి నివేదికలు పంపం : కేసీఆర్

పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వీచిన గాలివానతో వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. దీంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురాన్ని సందర్శించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి, అకాల వర్షాలతో  పాడైన వరి, మొక్కజొన్న, మామిడి పంటలను ఆయన పరిశీలించారు.

మొత్తం 79 వేల ఎకరాల్లో వరి పంట నష్టానికి గురైందని సీఎం కేసీఆర్ తెలిపారు. గాలివానతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం వాటిల్లిందన్న ఆయన.. రైతులు నిరాశకు గురికావల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. పంట నష్టపరిహారంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా నష్టపరిహారం ఇవ్వలేదని.. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి రిపోర్ట్స్ పంపమని సీఎం చెప్పారు. తమ రైతులను తామే ఆదుకుంటామన్నారు. దేశంలోనే మొదటిసారి సహాయ పునరావాస చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందజేస్తామని, కౌలు రైతులను సైతం ఆదుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. వాళ్లక్కూడా న్యాయం చేస్తామన్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.228కోట్లను ఇప్పుడే మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు.