వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో 30 శాతం దుర్వినియోగం
మొత్తం రూ.2,500 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు
రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్టు కేంద్రానికి తప్పుడు లెక్కలు
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గొర్రెలు కొనకుండానే కొన్నట్టు, లబ్ధిదారులకు ఇయ్యకుండానే ఇచ్చినట్టు కాగితాలపై లెక్కలు రాయడంతో పాటు రీసైక్లింగ్ దందా ద్వారా కోట్లు కొల్లగొట్టిన బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. ఇలా పేపర్ గ్రౌండింగ్, రీసైక్లింగ్ దందా ద్వారానే గొర్రెల స్కీమ్ పథకం నిధుల్లో దాదాపు 30 శాతం గోల్ మాల్ అయినట్టు తెలుస్తున్నది. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 4.25 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయగా, అందుకు రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చయింది. ఇందులో 30 శాతమంటే దాదాపు రూ.1,500 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక మిగిలిన 70 శాతం నిధులతో గొర్రెలను పంపిణీ చేసినప్పటికీ, అందులోనూ చాలా వరకు అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్నది. రూల్స్ ప్రకారం రెండేండ్లకు పైగా వయసు ఉన్న ఆరోగ్యకరమైన గొర్రెలను మాత్రమే పంపిణీ చేయాలి.
కానీ ముసలి గొర్రెలు, చిన్న చిన్న గొర్రె పిల్లలను లబ్ధిదారులకు అంటగట్టారు. అలాంటి గొర్రెలు కొన్ని ఇక్కడి పరిస్థితులకు తట్టుకోలేక చనిపోయాయి. ఇక మిగిలిన కొన్నింటిని లబ్ధిదారులు విక్రయించినట్టు సమాచారం. మొత్తానికి ఈ పథకం ద్వారా చేకూరిన ప్రయోజనం శూన్యమని, అక్రమార్కుల జేబులు మాత్రం నిండాయనే విమర్శలు ఉన్నాయి. కాగా, ఈ స్కామ్ పై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తున్నది. రూ.700 కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించింది. అయితే ఈ స్కీమ్ లో మొత్తం రూ.2,500 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీలాండరింగ్ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కూడా ఎంటరైంది. మరోవైపు గొర్రెల పంపిణీలో గోల్ మాల్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 23కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటన్నింటిపై మళ్లీ విచారిస్తే అసలు బాగోతం బయటపడుతుందని అంటున్నారు.
దళారులతో కుమ్మక్కయి...
ఓవైపు కేవలం పేపర్ల మీద లెక్కలు రాసి.. మరోవైపు గొర్రెలను తెచ్చినట్టు, ఇచ్చినట్టు ఫొటోలు తీసి రీసైక్లింగ్ దందాతో దోపిడీకి పాల్పడ్డారు. ఇందులో పశుసంవర్ధక శాఖ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు, దళారులు కీలక పాత్ర పోషించారు. ఒక్కో యూనిట్ లో రూ.12 వేల నుంచి రూ.22 వేల వరకు కమీషన్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వెటర్నరీ డాక్టర్లు, దళారులు కుమ్మక్కయి గొర్రెలు కొనకుండానే కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపి పేపర్ గ్రౌండింగ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 2019లో కరీంనగర్జిల్లాలో ఓ వెటర్నరీ అధికారి, బ్రోకర్ కుమ్మక్కయి 669 గొర్రెల యూనిట్లను పేపర్ గ్రౌండింగ్చేశారు. దీనిపై అప్పటి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఎంక్వైరీ చేసి అక్రమాలను గుర్తించారు. ఇక కొందరు అధికారులైతే బినామీలను సృష్టించి దోపిడీకి పాల్పడ్డారు. లబ్ధిదారుల పేరు మీద రూ.31,250 డీడీ తీసి.. గొర్రెలను కొనుగోలు చేసినట్టు, వాటిని లబ్ధిదారులకు అప్పగించినట్టు ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసేవారు. గొర్రెలను లారీ ఎక్కించిన తర్వాత 20 నిమిషాల్లోనే వాటిని తిరిగి అప్పగించేవారు. ఇదంతా చేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు తమ బండారం బయటపడుతుందని గొర్రెల సంఖ్యలో తెలంగాణనే నంబర్ వన్ గా ఉన్నట్టు కేంద్రానికి తప్పుడు లెక్కలు పంపారనే ఆరోపణలు ఉన్నాయి.
యూనిట్ కాస్ట్ పెంచి దోపిడీ..
గొర్రెల స్కీమ్ 2017లో ప్రారంభమైంది. మొదటి విడతలో ఒక్కో యూనిట్ విలువ రూ.1.25 లక్షలుగా నిర్ధారించారు. ఇందులో లబ్ధిదారుల వాటా రూ.31,250, ప్రభుత్వ సబ్సిడీ రూ.93,750. మొత్తం రూ.1.25 లక్షల్లో రూ.1.11 లక్షలు గొర్రెలకు, రూ.6,300 ట్రాన్స్‌పోర్టు, రూ.420 మందులు, రూ.3,800 బీమా, దాణాకు రూ.3,440 కేటాయిం చారు. అయితే ఆ తర్వాత యూనిట్ కాస్ట్ పెంచారు. రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలు చేశారు. అప్పట్లో పశుసంవర్ధక శాఖలో పని చేసిన కీలక వ్యక్తులే దళారులను ప్రోత్సహించి యూనిట్ కాస్ట్ పెంచేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా వేల కోట్లు చేతులు మారినట్టు తెలుస్తున్నది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.25 లక్షల యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశారు. అయితే మొదటి విడత పంపిణీ చేసిన గొర్రెల్లో 50 శాతం ఏడాది కాలానికే మాయమైనట్టు నట్టల మందు పంపిణీలో తేలింది.
అన్ని దొంగ లెక్కలు..
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ స్కీమ్ తో గొర్రెల సంఖ్య పెరగలేదు. పథకం ప్రారంభించిన ఏడాదిలోనే గొర్రెల సంఖ్య భారీగా పెరిగినట్టు అధికారులు దొంగ లెక్కలు చూపించారు. ఈ స్కీమ్ లో అంతా గోల్మాల్ జరిగింది. లబ్ధిదారులకు గోరంత లబ్ధి జరిగితే, అక్రమార్కులకు కొండంత లబ్ధి జరిగింది. గొల్లకురుమలను దోషులుగా చూపెట్టి.. అధికారులు, దళారులు, ప్రజాప్రతినిధులు దోచుకున్నారు.
- ఉడుత రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీఎంపీఎస్