- సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేసిన రూ.1500 కోట్ల లెక్క తేల్చాలి
- టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్
- పోలీసుల ఆంక్షల మధ్య ఆమరణ నిరాహార దీక్ష
- తనతో పాటు ఎమ్మెల్యే సండ్ర దీక్ష చేయాలని డిమాండ్
సత్తుపల్లి, వెలుగు: సింగరేణి ప్రభావిత ప్రాంత ప్రజల కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేశామని అధికారులు చెబుతున్నారని, దీనిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ డిమాండ్ చేశారు. గురువారం వెంగళరావునగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకొని టెంట్, కుర్చీలు, కార్పెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభావిత ప్రాంత ప్రజలు, మహిళలు పోలీసులను నిలవరించారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ సత్తుపల్లి ప్రాంత ప్రజల ఓట్లతో మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులను సత్తుపల్లి తీసుకొచ్చి మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు.
ప్రజలకు అండగా నిలిచే ఆలోచన ఉంటే తనతో కలిసి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీక్షలో కూర్చోవాలని సవాల్ చేశారు. వెంగళరావునగర్, జలగంనగర్, ఎన్టీఆర్ నగర్, రేజర్ల, కిష్టారం ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్రతీ ఇంటికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నున్న రామకృష్ణ, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సభ్యుడు రావి నాగేశ్వరరావు, సొసైటీ ఉపాధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, మాజీ ఎంపీటీసీ ఐ కృష్ణ, లీడర్లు మానుకోట ప్రసాద్, ఫజల్ బాబా, ఎండీ సమద్, మహేంద్రపాషా, భుక్యా శివకుమార్, మందలపు శ్రీనివాస్ రెడ్డి, ధనలక్ష్మి, కుమారి, సలీం, నాగేంద్రచారి పాల్గొన్నారు.