వరంగల్/కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండలో భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీ హక్కుల సాధన’ రౌండ్ టేబుల్ సమావేశంలోనూ, కరీంనగర్లో బీసీ కుల సంఘాల నాయకులు, మేధావులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ కవిత మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం, బీసీ డిక్లరేషన్‍లో 6 నెలల్లో రాష్ట్రంలో కులగణన చేపడతామని ప్రకటించిందని, ఈ మేరకు ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటన చేయాలన్నారు.
‘‘రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే 23,973 మందికి ఎంపీటీసీ, సర్పంచు, కౌన్సిలర్, జడ్పీటీసీ, ఎంపీపీ, చైర్మన్లు అయ్యే అవకాశాలు వస్తాయని కాంగ్రెస్ చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా ఆ హామీ అమలు చేయాలి. లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదు. బీసీ సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ సమవేశాల్లో ఆ నిధులు కేటాయించాలి. జనగామ జిల్లాను సర్దార్ పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని చెప్పిన ప్రకారం జిల్లాకు ఆ పేరు పెట్టాలి. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి. పూలే జయంతి వరకు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలి” అని కవిత డిమాండ్ చేశారు.
పూలే విగ్రహం పెట్టకుంటే.. రాష్ట్ర ప్రభుత్వ అంతు చూస్తాం
వరంగల్లో పూలే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గట్టు రాంచందర్ మాట్లాడుతూ.. దేశంలో 55 శాతం బీసీలు ఉన్నారని తెలిపారు. ఇచ్చిన గడువులోగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టకుంటే, రాష్ట్ర ప్రభుత్వ అంతు చూస్తామన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో బీసీలు ఎదగలేకపోతున్నారని అన్నారు. రిజర్వేషన్లు లేకపోవడమే దీనికి కారణమన్నారు. వరంగల్లో కుడా మాజీ చైర్మన్ సుందర్ రావజ్ యాదవ్, కరీంనగర్ లో యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు గట్టు రామచంద్రారావు, రాజారాం యాదవ్ పాల్గొన్నారు.
ALSO READ: అహంకారంతో మాట్లాడితే చూస్తూ ఊరుకోం