ఈసారి కారుకు పంక్చర్ చేయాలె : వివేక్ వెంకటస్వామి

ఈసారి కారుకు పంక్చర్ చేయాలె : వివేక్ వెంకటస్వామి

నాగర్ కర్నూల్ : బీజేపేయేతర రాష్ట్రంలో కంటే తెలంగాణలో గ్యాస్ ధర రూ. 230 ఎక్కువని, పెట్రోల్ , డీజిల్ కూడా లీటర్​‌‌పై 10 రూపాయలు అధికమని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి వ్యాఖ్యనించారు. నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా గోస–బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఎలక్షన్లు వస్తున్నయి. కేసీఆర్ బయటకు వస్తారు. పాత హామీల జోలికి పోకుండా కొత్త ముచ్చట చెప్తారు. మోసపోయి ఓట్లేస్తే ఐదేండ్లు గోస పడుతారు. కారుకు పంక్చర్ చేయాలి’ అని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన తర్వాత ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ తన కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుని కొడుకు అందరికీ తలా ఒక ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.25 లక్షల జీతం తీసుకుంటున్నారని విమర్శించారు. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని చెప్పి.. తాను మాత్రం బుల్లెట్ ప్రూఫ్ గోడల మధ్య 100 బెడ్ రూమ్స్ ప్రగతి భవన్ కట్టుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పరిసరాల్లో 20 వేల ఎకరాలు సంపాదించిన కేసీఆర్ పేదోళ్లకు గజం భూమి పంచిన పాపాన పోలేదని మండిపడ్డారు. వేల ఎకరాల్లో కొడుకు, బిడ్డకు ఫాం హౌస్ లు కట్టిచ్చిండే కానీ పేదలకు మాత్రం డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టలేదన్నారు. 

కమీషన్ల కోసం కక్కుర్తి .. 

పీఎం ఆవాస్ యోజన కింద పేదల ఇండ్లకు నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తే కేసీఆర్ వాటిని ప్రాజెక్టులకు డైవర్ట్ చేసి కమీషన్లు తీసుకుంటున్నాడని వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. యూపీలో సీఎం యోగి 50 లక్షల ఇళ్లు కట్టి రికార్డ్ సృష్టించారని తెలిపారు. మిషన్ భగీరథ కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టినా నీళ్లు వస్తలేవని, కమీషన్ల కోసం కక్కుర్తి పడి క్వాలిటీ లేని పనులు చేశారని అన్నారు. కొల్లాపూర్ మామిడి రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించలేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యకుడు ఎల్లేని సుధాకర్ రావు పట్టుబట్టి కల్వకుర్తి–నంద్యాల హైవే, సోమశిల వద్ద సస్పెన్షన్ బ్రిడ్జి సాధించారని చెప్పారు. అలంపూర్ చౌరస్తా నుంచి కొల్లాపూర్ మీదుగా దేవరకొండ వరకు మరో హైవే, మాచర్ల-రాయచూరు రైల్వే లైన్ కోసం కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే భారత్ లో నేషనల్ హైవేల నిర్మాణం వేగంగా జరుగుతుందని, ప్రతి రోజు 37 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం  జరుగుతోందన్నారు. 

డబుల్​ ఇంజన్​ సర్కార్​ రావాలె

మోడీ ప్రభుత్వం వస్తేనే పేదలకు ఇండ్లు, యువతకు ఉద్యోగాలు వస్తాయని వివేక్ వెంకట స్వామి అన్నారు. తెలంగాణ అప్పు రూ.60వేల వేల కోట్ల నుంచి రూ.5లక్షల కోట్లకు చేరిందని, కేసీఆర్ కుటుంబ ఆస్తులు అదే స్థాయిలో పెరిగాయని చెప్పారు. జనం బాధలు తీరాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలె అని కోరారు. కారును పంక్చర్ చేసి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో గ్యాస్,పెట్రోల్, డీజిల్, కరెంట్, బస్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.