ప్రతిపాదనలు దాటని.. వరద మళ్లింపు పనులు

  • సిరిసిల్లలో కాగితాలకే పరిమితమైన రూ.280 కోట్ల పనులు 
  • కేటీఆర్​ఇలాకాలోనూ పనులు ప్రారంభం కాలే.. 
  • గతేడాది భారీ వర్షాలతో మునిగిన జిల్లాకేంద్రం 
  • మొక్కుబడిగా సాగుతున్న పనులు 
  • గతేడాదిని తలుచుకొని ఆందోళనలో పట్టణవాసులు 

రాజన్నసిరిసిల్ల, వెలుగు:  గతేడాది సెప్టెంబర్‌‌లో కురిసిన వర్షాలు సిరిసిల్లను ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో మంత్రి కేటీఆర్​ఆదేశాలతో సిరిసిల్లలో వరదల నియంత్రణకు శాశ్వత పనులు చేపట్టేందుకు రూ.280కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కార్‌‌కు పంపారు. కానీ ఆ ప్రతిపాదనలు పేపర్లకే పరిమితమయ్యాయి. నేటికీ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు వర్షాకాలం సమీపిస్తుండడంతో పట్టణవాసులు గతేడాది పరిస్థితిని తలుచుకొని ఆందోళన చెందుతున్నారు.  వరదలు వచ్చినప్పుడే పరుగులు.. ఆ తర్వాత అంతా శరామామూలే అన్నట్టుగా ఉందని పట్టణవాసులు భావిస్తున్నారు. 

ప్రతిపాదనల దశలో  రూ.280 కోట్ల పనులు

నాలుగేండ్ల నుంచి భారీ వర్షాలతో జిల్లాకేంద్రం సిరిసిల్ల మునుగుతోంది. ఏటా ఎగువ ప్రాంతాల్లో 20 చెరువులు మత్తళ్లు దూకుతుండడంతో వరద నీరు పట్టణాన్ని ముంచెత్తుతోంది. ఈ వరద నుంచి సిరిసిల్లను కాపాడేందుకు రూ.280 కోట్లతో శాశ్వత వరద మళ్లింపు పనులు చేపట్టేందుకు  ఆఫీసర్లు ప్రణాళికలు రూపొందించారు. సిరిసిల్ల ఎగువనున్న చెరువులు మత్తళ్లు దుంకినప్పడు ఆ నీరంతా మిడ్​మానేర్‌‌లో కలిసేలా వరద కాలువ నిర్మించాలని నిర్ణయించారు. దీనికోసం రగుడు బైపాస్ నుంచి కాలువ నిర్మించేందుకు ప్లాన్​చేశారు. కానీ ఈ కాలువ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. మరోవైపు రూ.6కోట్లతో కొత్త చెరువు వరద నీటిని  మళ్లించేందుకు శాంతినగర్ బైపాస్ రోడ్ నుంచి కాలువ నిర్మిస్తున్నారు. ఈ కాలువ పనులు స్లోగా సాగుతున్నాయి. గతేడాది నుంచి ఇప్పటివరకు మట్టిపనులు మాత్రమే పూర్తిచేశారు.

చెరువు శిఖం భూముల్లో కాలనీలు

సిరిసిల్లలో ప్రస్తుత వరదలకు చెరువు భూముల కబ్జాలే కారణమని ప్రజలు చెబుతున్నారు. శిఖం భూముల్లో  కాలనీలు పుట్టుకురావడంతో చెరువు నీటి నిల్వ సామర్థ్యాలు తగ్గిపోయాయి. రాయినిచెరువు ను పూడ్చి బీవైనగర్, గణేశ్​నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్ కాలనీలు అవతరించాయి.  కొత్త చెరువును సుందరీకరణ పేరుతో శిఖం ప్రాంతాన్ని పూడ్చి గార్డెన్ ను తయారు చేశారు. దీంతో కొత్త చెరువులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. కొద్దిపాటి వరదకే చెరువు మత్తడి దూకుతోంది.  మరోవైపు పట్టణంలోని వరద నీరు పోయేందుకు సరైన డ్రైనేజీ సిస్టం లేదు. గతంలో వరద నీరంతా డైరెక్ట్‌గా మానేరులో కలిసేది. ప్రస్తుతం మిడ్​మానేరు చుట్టూ కరకట్ట నిర్మించడంతో నదిలో వరద కలిసే పరిస్థితి లేదు. 

టౌన్‌కు వరద ముప్పు

సిరిసిల్ల పట్టణం ఎగువ ప్రాంతాల్లో 20 చెరువులు ఉన్నాయి. ఇవి మత్తళ్లు పోసినప్పుడల్లా పట్టణానికి వరద ముప్పు పెరుగుతోంది.  ఈదుల చెరువు, పెద్ద చెరువు, కొలనూరి, మర్తనపేట, జంగం వాణి, భామని కుంట, ఎర్రకుంట, కొలనూర్ ట్యాంక్, గిర్రవాణికుంట చెరువులు పొంగినప్పుడల్లా ఆ నీరంతా సిరిసిల్ల పట్టణంను ఆనుకొని ఉన్న కొత్తచెరువులోకి చేరుతోంది. అనంతరం సిరిసిల్ల లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. వెంకంపేట, ప్రగతినగర్, బీవైనగర్, సుందరయ్యనగర్, శాంతినగర్, సంజీవయ్యనగర్, అంబేద్కర్ నగర్, పాతబస్టాండ్ కాలనీలు నీట మునిగాయి. గతేడాది వ్యాపార కూడలి అయిన పాత బస్టాండ్​ప్రాంతం నీటమునగడంతో దుకాణాల్లోకి నీరు చేరి వస్తువులు పాడయ్యాయి.

 కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను కూడా వరదలు చుట్టుముట్టడంతో కలెక్టర్​అనురాగ్​జయంతి వరదలో చిక్కుకుపోయారు.  కాలనీల్లోకి వరదలు రాకుండా రగుడు బైపాస్ మీదుగా కలెక్టరేట్ అవతలి వైపు నుంచి మానేరు వాగులోకి మళ్లించేందుకు కాలువ తవ్వుతున్నారు. వరద ఎక్కువైతే కొత్త చెరువు రోడ్డుపై, బైపాస్ రోడ్డు కింద నుంచి వెళ్లేలా బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఆ పనులన్నీ స్లోగా సాగుతున్నాయి.