రూ.375 కోట్ల క్యాష్, డ్రగ్స్ పట్టుకున్నం

రూ.375 కోట్ల క్యాష్, డ్రగ్స్ పట్టుకున్నం
  • చీరలు, ప్రెషర్ కుక్కర్లు,ఇతర వస్తువులు కూడా..
  • నిరుటి కన్నా ఈసారి 4.5 రెట్లు ఎక్కువగా సీజ్
  • కర్నాటక ఎన్నికల సంఘం అధికారుల వెల్లడి

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బు, మద్యం, డ్రగ్స్  పంపిణీ చేయడానికి పలు పార్టీల అభ్యర్థులు చేసిన ప్రయత్నాలకు ఎన్నికల అధికారులు చెక్  పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించి రూ.375 కోట్ల విలువైన క్యాష్​, డ్రగ్స్, ప్రెషర్  కుక్కర్లు, ఇతర గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ కన్నా ఈసారి 4.5 రెట్లు ఎక్కువగా స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రకటించినప్పటి నుంచి అభ్యర్థుల ఖర్చుపై గట్టి నిఘా పెట్టామని ఈసీ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్  అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్(ఈడీ) రూ.288 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ సీట్లను విచ్చలవిడిగా ఖర్చుచేసే నియోజకవర్గాలుగా ఈసీ గుర్తించింది. కోలారు జిల్లాలోని బంగారపేట నియోజకవర్గంలో రూ.4.04 కోట్ల నగదు, బీదర్ జిల్లాలో వంద కిలోల గంజాయిని ఈసీ అధికారులు సీజ్ చేశారు. అలాగే కలబురగి, చిక్కమగళూరు, కుణిగల్ తో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చీరలు, ప్రెషర్  కుక్కర్  వంటి గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు.

గట్టి నిఘా వల్లే సాధ్యమైంది

ఎన్నికల కోడ్  అమల్లోకి వచ్చినప్పటి నుంచి అభ్యర్థుల కదలికలపై గట్టి నిఘా వేశామని ఈసీ అధికారులు తెలిపారు. ‘‘ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు చేసిన ప్రయత్నాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నాం. ఇందుకోసం ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకున్నాం. దీంతో భారీగా డబ్బు, మద్యం, హోం అప్లయెన్సెస్  వంటి వస్తువులను స్వాధీనం చేసుకోగలిగాం.

అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడమే మా లక్ష్యం. డబ్బు, మద్యం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. పూర్తి పారదర్శక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసారి అభ్యర్థుల కదలికలపై గట్టి నిఘా పెట్టినం. అందువల్లే గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈసారి 4.5 రెట్లు ఎక్కువగా డబ్బు, మద్యం తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నం” అని 
ఈసీ అధికారులు పేర్కొన్నారు.