నకిలీ బంగారం పెట్టి రూ. 56 లక్షల లోన్

గరిడేపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి రూ.56 లక్షల లోన్ తీసుకున్నారు. దీనిపై బ్యాంకు అధికారులు పీఎస్​లో ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం.. నేరేడుచర్ల మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన కేశవరపు రాజేశ్ గతంలో గోల్డ్ షాప్ లో పనిచేశాడు. 

గత సంవత్సరం మే నెలలో రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ లో తన పేరు, తన బంధువుల పేరు మీద దాదాపు కిలోన్నర నకిలీ బంగారం పెట్టి దాదాపు రూ.56 లక్షల లోన్ తీసుకున్నాడు. అయితే, లోన్ తీసుకొని సంవత్సరం దాటిన తర్వాత ఇటీవల ఇన్​స్పెక్షన్​  చేయగా బంగారం నకిలీదని తేలింది. దీంతో బ్యాంక్ అధికారులు రాజేశ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంగారం తనిఖీ చేయకుండా లోన్ ఇచ్చే అవకాశం ఉండదని, బ్యాంకు సిబ్బంది పాత్ర ఉంటుందన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.