ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. అక్రమంగా తరలిస్తున్న డబ్బును చెక్ పోస్టులు, నగర శివార్ల దగ్గర తనిఖీల్లో పోలీసులు పట్టుకుంటున్నారు. లేటెస్ట్ గా తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది.
నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ దగ్గర లారీ ఢీ కొట్టడంతో టాటా ఎస్ వాహనం బోల్తాపడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన కానిస్టేబుల్ ఎస్. రవికుమార్ వాహనంలో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. తౌడు బస్తాల మధ్యలో మొత్తం 7 బాక్సుల్లో నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు.
వాహనంలో ఒక్క సారిగా భారీగా నగదును చూడడంతో కంగారు పడిన కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు నగదును వీరవళ్లి టోల్ ప్లాజాకు తరలించి లెక్కించారు. నగదు మొత్తం దాదాపు రూ. 7 కోట్లు ఉంటుందని చెప్పారు. వ్యాన్ డ్రైవర్ కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.