రైల్వే స్టేషన్లకు  కొత్త హంగులు

  • అమృత్​భారత్ కింద నిజామాబాద్,​ కామారెడ్డి స్టేషన్ల ఎంపిక​
  •     రెండింటికి కలిపి రూ.93.2 కోట్ల ఫండ్స్​ శాంక్షన్​
  •     మాడ్రనైజేషన్​తో పాటు, సౌకర్యాల కల్పన

కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్,​ కామారెడ్డి రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. ఈ రెండు స్టేషన్లను మాడ్రన్​గా తీర్చిదిద్ది, ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అమృత్​ భారత్ స్కీమ్​ ద్వారా ఈ స్టేషన్లను డెవలప్​ చేయనున్నారు. ఇందుకోసం నిజామాబాద్​కు రూ.53.3 కోట్లు, కామారెడ్డికి రూ.39.9 కోట్ల ఫండ్స్​శాంక్షన్​ అయ్యాయి.సికింద్రాబాద్​ నుంచి  ఉత్తర భారతదేశానికి ఉమ్మడి నిజామాబాద్ ​జిల్లా మీదుగా రైల్వే లైన్​ఉంది. ఇటు సికింద్రాబాద్​ వైపు అటు మహారాష్ట్రలోని నాందేడ్, ముంబై వైపు రైళ్ల రాకపోకలు సాగుతాయి. నిత్యం 40కి పైగా ప్యాసింజర్, ఎక్స్​ప్రెస్ ​రైళ్లు ఈ మార్గం గుండా వెళ్తాయి. ఈ మార్గంలో నిజామాబాద్, కామారెడ్డి రైల్వేస్టేషన్లు ప్రధానమైనవి.

అమృత్​భారత్​ స్కీమ్​లో భాగంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా మన స్టేట్​లో 39 స్టేషన్లు సెలక్ట్​కాగా 21 స్టేషన్లకు కేంద్రం ఫండ్స్​రిలీజ్ చేసింది. నిజామాబాద్​ స్టేషన్​కు రూ.53.3 కోట్లు, కామారెడ్డికి రూ.39.3 కోట్లు ఖర్చు చేయనున్నారు. కామారెడ్డి స్టేషన్​ నుంచి జిల్లావాసులతో పాటు, పక్కనున్న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లావాసులు కూడా సుదూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లడానికి ఇక్కడికి వస్తారు. రోజుకు 6  వేల నుంచి 8 వేల మంది ప్రయాణికులతో స్టేషన్​ కిటకిటలాడుతుంది. నిజామాబాద్​ స్టేషన్​కు కూడా 15 వేలకు పైగా ప్రయాణికులు వస్తారు. ముంబై, తిరుపతి, విశాఖపట్నం, సికింద్రాబాద్, నాందేడ్​ తదితర ఏరియాలకు ట్రైన్లు వెళ్తుంటాయి. 

స్టేషన్లలో కల్పించే సౌకర్యాలు

ప్రస్తుతమున్న సౌకర్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు అదనంగా మరిన్ని సౌలత్​లు కల్పిస్తారు.స్టేషన్​ ఏరియాను మాడ్రనైజేషన్​ చేస్తారు. ప్రధానంగా ఇప్పుడున్న వెయిటింగ్​హాల్స్​ను విస్తరించడం, పుట్​ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, ఎస్కలేటర్లు, లిప్టుల ఏర్పాటు, ల్యాండ్​స్కేపింగ్, స్టేషన్​ పరిసరాల్లో పార్కులు, ఇంటిగ్రేటెడ్​ ప్యాసింజర్ ​ఇన్ఫర్మేషన్​ సిస్టమ్, రిజర్వేషన్​ కౌంటర్లను పెంచడం, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, టూ, ఫోర్​వీలర్స్​ పార్కింగ్ ​స్థలాల ఏర్పాటు, ప్లాట్​ఫారంపై ఉన్న షెల్టర్​ను విస్తరించడం, ప్లాట్​ఫారాలపై బెంచీలు, డిస్​ప్లే బోర్డుల ఏర్పాటు, వన్​ స్టేషన్​ వన్​ ప్రొడక్ట్​ షాపింగ్స్​వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.

స్టేషన్ లోపలి భాగాలతో పాటు, బయటి ప్రదేశాలు క్లీన్​గా ఉంచేందుకు గ్రీనరీ పెంచనున్నారు. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్​ స్టేషన్లలో పుట్​ ఓవర్ ​బ్రిడ్జి, లిప్టులున్నాయి. వెయిటింగ్​హాల్స్​చిన్నగా ఉన్నందున వాటిని విస్తరించనున్నారు. అమృత్​ భారత్​స్కీమ్​కింద చేపట్టే రైల్వేస్టేషన్ల ​మాడ్రనైజేషన్​ వర్క్స్​ను ఈ నెల 6న ప్రధాన మంత్రి మోదీ వర్చువల్​గా ప్రారంభించనున్నారు.