RSA vs AFG: ఒమ‌ర్జాయ్ వీరోచిత ఇన్నింగ్స్.. సఫారీల ముందు పోరాడే లక్ష్యం

అఫ్ఘన్లు మరోసారి పర్వాలేదనిపించారు. సఫారీల ముందు పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించారు. అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 244 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్(97 నాటౌట్; 107 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గనిస్తాన్‌కు మంచి ఆరంభం లభించింది. తొలి వికెట్‌కు ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్(25)- ఇబ్ర‌హీం జ‌ర్దాన్(15) జోడి 41 పరుగులు జోడించారు. ఆపై వచ్చిన బ్యాటర్లు దాన్ని కొనసాగించలేకపోయారు. అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్(97 నాటౌట్) ఒక ఎండ్ నుంచి పోరాడినా.. అతనికి  మరో ఎండ్ నుంచి సహకారం లేకపోయింది. ఆఖరిలో నూర్ అహ్మద్(26) పర్వాలేదనిపించాడు. ర‌హ్మ‌త్ షా(26), హ‌ష్మ‌తుల్లా షాహిదీ(2), ఇక్రం అఖిల్(12), న‌బీ(2) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జ్ 4 వికెట్లు పడగొట్టగా..  ఎంగిడి, కేశ‌వ్ మ‌హారాజ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.