RSA vs AFG: ఓడినా భయపెట్టారు.. అఫ్ఘనిస్తాన్‌పై దక్షణాఫ్రికా విజయం

RSA vs AFG: ఓడినా భయపెట్టారు.. అఫ్ఘనిస్తాన్‌పై దక్షణాఫ్రికా విజయం

అండర్ డాగ్స్‌గా వరల్డ్ కప్ టోర్నీలోకి అడుగుపెట్టిన అఫ్ఘన్లు గౌరవప్రదంగా టోర్నీని ముగించారు. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా.. వారి పోరాటాన్ని మెచ్చుకోవాల్సిందే. సెమీస్ చేరే అవకాశాలు లేనప్పటికీ.. విజయం కోసం ఆఖరి వరకూ పోరాడారు. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఆఫ్ఘన్లు నిర్ధేశించిన 245 పరుగుల స్వల్ప చేధనలోనూ సఫారీలు తడబడ్డారు. వికెట్లు పడితే ఎక్కడ ఓడిపోతామేమో అన్న భయం వారిలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒకానొక దశలో 130 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా వాండర్ డస్సెన్(76 నాటౌట్) నిలకడగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. క్వింటన్ డికాక్(41), టెంబ బవుమా(23), ఐడెన్ మార్క్రామ్(25), హెన్రిచ్ క్లాసెన్(10), డేవిడ్ మిల్లెర్క్(24), ఆండిలే ఫెహ్లుక్వాయో(39 నాటౌట్) పరుగులు చేశారు. 

ఒమర్జాయ్ ఒంటరి పోరాటం

అంతకుముందు అజ్మతుల్లా ఒమర్జాయ్(97 నాటౌట్) రాణించడంతో అఫ్గనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 244 పరుగులు చేసింది. రహ్మత్ షా 26, నూర్ అహ్మద్ 26, రహ్మానుల్లా గుర్బాజ్ 25, ఇబ్రహీం జద్రాన్ 15, రషీద్ ఖాన్ 14, ఇక్రమ్ అలీఖిల్ 12 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీశారు.