కరేబియన్ గడ్డపై ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో సఫారీ జట్టు 40 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.
16 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
మొదటి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమర్ జోసెఫ్ 5, జేడెన్ సీల్స్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే కుప్పకూలింది. జాసన్ హోల్డర్(54 నాటౌట్) ఒక్కడు ఒంటారి పోరాటం చెశాడు. దాంతో, సఫారీ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 16 ఆధిక్యం లభించింది.
263 పరుగుల లక్ష్యం
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ప్రొటీస్ 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మర్క్‌రమ్(51), వెర్రియెన్నే(59) హాఫ్ సెంచరీలు చేశారు. జేడెన్ సీల్స్ 6 వికెట్లు పడగొట్టాడు. 16 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని సఫారీ జట్టు.. విండీస్ ఎదుట 263 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
భయపెట్టిన మోతీ-డిసిల్వా
లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు 222 పరుగులకే ఆలౌటైంది. 104 పరుగులకే 6 వికెట్లు కొల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్న విండీస్‌ను గుడాకేష్ మోతీ(45), జాషువా డా సిల్వా(27) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. దాంతో, మ్యాచ్ ఉత్కంఠను తలపించింది. విజయం దిశగా సాగుతున్న విండీస్‌ను అంపైర్ నిర్ణయాలు దెబ్బతీశాయి. మోతీ, డిసిల్వాల ఎల్బీడబ్ల్యూల విషయంలో అంపైర్ నిర్ణయాలు ప్రొటీస్ జట్టుకు అనుకూలంగా మారడంతో.. కరేబియన్ సేనకు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు:
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 160/10
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 144/10
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 246/10
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 222/10
ఆరో స్థానానికి పాక్
ఈ విజయంతో దక్షిణాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ లో తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. పాకిస్తాన్‌ను ఆరో స్థానానికి నెట్టి ఐదో స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం WTC పట్టికలో 68.51 విజయాల శాతంతో భారత్ అగ్రస్థానంలో ఉండగా..డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా( 62.50 విజయాల శాతం) రెండవ స్థానంలో ఉంది.