కొల్లాపూర్, వెలుగు : బీజేపీ సర్కారు రాజ్యాంగాన్ని కాలరాస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నాగర్కర్నూల్జిల్లా కొల్లాపూర్లో పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని, దేశంలో మతపరమైన స్వేచ్ఛ లేదన్నారు. కేంద్రంలో మోదీ బడే భాయ్ అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి చోటా భాయ్ అని ఎద్దేవాచేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం జరగలేదని, కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. దాన్ని తిప్పి కొట్టేందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణలో బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు కుదుర్చుకుందన్నారు. దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసేది లేదని చెబుతోందన్నారు. బీసీలకు అన్యాయం చేయడం రామరాజ్యం కాదన్నారు. బీఎస్పీ నాయకులు శేఖరయ్య, బాలకృష్ణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.