- వారిని అడ్డుకొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు
- కమ్యూనిస్టు పార్టీలను, ప్రజాస్వామిక పార్టీలను కలుపుకుని ముందుకెళ్లాలి
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి వెల్లడి
మంచిర్యాల, వెలుగు: దేశంలో రాజ్యాంగాన్ని మార్చడమే ఏకైక లక్ష్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ముందుకెళ్తున్నాయని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజ్యాంగంలో సెక్యులర్ పదాన్ని తొలగించి మతోన్మాదం, హిందూయిజంతో దేశాన్ని పాలించాలని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. మంచిర్యాలలో మంగళవారం సీపీఐ శతాబ్ది ఉత్సవాల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో సోషలిజం, సెక్యులరిజం ఉండాలని కోరుకునే కమ్యూనిస్టులపై అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేసి అర్బన్ నక్సలైట్ల పేరుతో ప్రజలకు దూరం చేయాలనే కుట్రలను కేంద్రం చేస్తోందని మండిపడ్డారు.
గతంలో వాజ్ పేయి హయాంలోనే రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేయగా ప్రజల్లో తిరుగుబాటు రావడంతో విరమించుకున్నారని, ఇప్పుడు మోదీ కూడా అదే విధంగా చేస్తూ.. తాత్కాలికంగా వాయిదా వేశారన్నారు. బీజేపీని అడ్డుకొనే శక్తి కాంగ్రెస్ కు లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు, వామపక్షవాదులు, ప్రజాస్వామ్య పార్టీలు ఒక్కటిగా ముందుకెళ్లడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు పాల్గొన్నారు.
మీడియా ప్రజల పక్షాన ఉండాలి
ప్రభుత్వం, పాలక వర్గాల తప్పులను ఎత్తి చూపుతూ మీడియా ప్రజల పక్షాన ఉండాలని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వారధిగానూ పని చేయాలని సూచించారు. మంచిర్యాలలోని నార్త్ ఇన్ హోటల్ లో స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం –- మీడియా బాధ్యత’ పై నిర్వహించిన సెమినార్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(-1)– ఏ అందించిన పత్రికా స్వేచ్ఛను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సమాజ శ్రేయస్సు దృష్ట్యా వర్కింగ్ జర్నలిస్టులుగా తమదైన ముద్ర వేసుకోవాలని కోరారు.
సమాజానికి జర్నలిస్టు డాక్టర్ వంటివాడని, దెబ్బతిన్న సమాజాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వీరిపైనే ఉందన్నారు. మీడియాపై జరుగుతున్న దాడులపై ప్రతి జర్నలిస్టు పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల వేతన సవరణతో పాటు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్, ప్రకాశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి, కోశాధికారి వంశీకృష్ణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు సురేష్ చౌదరి, రమేష్ రెడ్డి, వివిధ ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు, కార్యదర్శులు జర్నలిస్టులు పాల్గొన్నారు.